భారీ వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలమైన విషయం తెలిసిందే. 400 మంది చనిపోయారు. వరదల్లో చిక్కుకుని చాలామంది బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీశారు. వారిని కాపాడటానికి అనేక మంది మత్స్యకారులు, రెస్క్యూ సిబ్బంది చేసిన కృషి అంతా ఇంతా కాదు. వరదల్లోని ప్రజలను సురక్షితంగా కాపాడి బయటకు తీసుకొచ్చిన ఓ యువకుడిపై విధి చిన్న చూపు చూసింది. మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చి ఆ యువకుడి ప్రాణాలు బలి తీసుకుంది.కేరళకు చెందిన జినేశ్(24) మత్స్యకారుడు. ఇటీవల రాష్ట్రంలో తలెత్తిన విపత్తులో చిక్కుకున్న వారిని ప్రాణాలకు తెగించి కాపాడాడు. అతను చేసిన కృషిని ప్రతి ఒక్కరూ మెచ్చకున్నారు. అలాంటి జినేశ్ శనివారం తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి లారీ కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు అతడిని తిరువనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జినేశ్ కన్నుమూశాడు.
అలపుజాలోని చెన్గన్నూర్లో వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు మొదట ముందుకొచ్చిన జినేశ్ ఒక్కడు. అతని గురించి, వారి కుటుంబ గురించి ఏమాత్రం ఆలోచించకుండా ప్రాణాలను పనంగా పెట్టి జినేశ్ సహాయక చర్యల్లో పాల్గొన్నాడు. వీరి సేవలను గుర్తించిన కేరళ ప్రభుత్వం జినేశ్తో పాటు మిగతా వారికి ప్రశంసాపత్రాలు అందజేసింది. సహాయక చర్యల్లో పాల్గొన్న 200మంది మత్స్యకారులకు ‘కోస్టల్ వార్డెన్స్’గా పోలీసు ఉద్యోగాలు కూడా ఇస్తామని కేరళ మంత్రి పక్రటించిన విషయం తెలిసిందే.