పిల్లి ఎదురైతేనో, బల్లి మీద పడితేనో.. ఇంకే జంతువైనా అర్ధరాత్రి ఏడుస్తేనో అపశకునంగా భావిస్తారు మన దేశంలో కొంతమంది. అయితే ఓ చేప కనిపిస్తే కూడా.. కచ్చితంగా ఏదో కీడు జరగబోతుందని అంటున్నారు చిలీ దేశస్థులు. సౌత్ అమెరికాలో తీరప్రాంతంలో ఉన్న ఆ దేశంలో సముద్రవేటకు వెళ్లిన మత్స్యకారుల బృందానికి 16 అడుగుల పొడవున్న ఓ అరుదైన చేప చిక్కింది. ఆ చేపను సముద్రం ఒడ్డుకు తీసుకొచ్చి క్రేన్కి వేలాడదీసిన వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాలా పొడవుగా కనిపిస్తున్న ఈ చేపను ‘ఓర్ ఫిష్’గా గుర్తించారు.
5 మీటర్ల పొడుగున్న ఈ చేపను చూసిన జనాలు ఆశ్చర్యపోవడం మానేసి.. ఏదో చెడు జరగబోతుందని హడలిపోతున్నారు. ఆ దేశంలో ఓర్ ఫిష్ కనిపిస్తే.. సునామీ, భూకంపాలు వస్తాయని ఒక నమ్మకం ఉంది. సముద్రగర్భం లోతుల్లో జీవించే ఓర్ ఫిష్ భూపొరల్లో కదలికలు వచ్చినప్పుడు మాత్రమే సముద్రజలాల ఉపరితలానికి చేరతాయని ఓ నెటిజన్ తెలిపాడు. జలాల్లో పైకి వచ్చాయంటే సముద్ర గర్భంలో భారీ భూకంపాలు సంభవిచ్చినట్టు సంకేతమని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. అయితే ఈ సిద్ధాంతాన్ని సైన్స్ నిర్ధారించలేదు. కాగా ప్రస్తుతం ఈ చేప జలాలపైకి రావడానికి కారణం ఏంటో అధికారులు గుర్తించాలని సూచనలు అందుతున్నాయి. కాగా ఓర్ ఫిష్ పొడవు 11 మీటర్ల వరకు ఉంటుంది. ఇవి సముద్రపు నీటి అడుగున జీవిస్తాయి. ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు, బ్రీడింగ్ సమయంతోపాటు చనిపోయాక కూడా జలాలపైకి వస్తాయని నిపుణులు వివరించారు.