రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దులు పంచుకుంటున్న నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్లో చేపలు పట్టే విషయంలో మత్స్యకారుల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. అనంతరం ఆరుగురు మత్స్యకారులను అపహరించి తెలంగాణకు తీసుకొచ్చారు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఘటన గురించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సాగర్ బ్యాక్ వాటర్లో ఇరు రాష్ట్రాల మత్స్యకారులు చాలా కాలం నుంచి చేపలు పడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ఏపీకి చెందిన మత్స్యకారులు రింగు వలలతో చేపలు పట్టడానికి నదిలో దిగారు. ఇది గమనించిన తెలంగాణ మత్స్యకారులు రింగు వలలతో చేపలు పట్టడానికి వీల్లేదని వారించారు.
ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో ఏపికి చెందిన మత్స్యకారులకు గాయాలు కాగా, అదే సమయంలో ఆరుగురు మత్స్యకారులను తెలంగాణ మత్స్యకారులు అపహరించారు. అనంతరం వారిని నల్గొండ జిల్లా చందంపేట మండల గ్రామానికి తీసుకెళ్లారు. విషయం తెలిసిన వెంటనే ఏపీకి చెందిన పోలీసులు రంగంలోకి దిగి, చందంపేటకు చేరుకున్నారు. తెలంగాణ మత్స్యకారులకు సర్ధి చెప్పి ఏపీకి చెందిన ఆరుగురు మత్స్యకారులను విడిపించుకొని వెళ్లగలిగారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఇరు వర్గాలు శాంతించాయి.