రెండు గ్రామాల మధ్య చేపల లొల్లి.. 12 మందికి గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

రెండు గ్రామాల మధ్య చేపల లొల్లి.. 12 మందికి గాయాలు

July 5, 2020

anantapur

చేపల కోసం రెండు గ్రామాల ప్రజలు కొట్లాడుకున్నారు. ఈ కొట్లాటలో గాయపడ్డ 12 మందిని ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లాలోని రొద్దం మండలం తురకల పట్నం చేపల చెరువు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామంలోని చెరువుకు కృష్ణా జలాలు భారీగా వచ్చి చేరాయి. దీంతో తురకలపట్నం, పెద్ద కోడిపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు చెరువులోని చేపల విషయంలో వాదించుకున్నారు.  గతంలో పెద్దకోడిపల్లి గ్రామానికి చెందిన చేపల సొసైటీ ఉందని.. కాబట్టి తమకు ఆ చెరువుపై సర్వాధికారాలు ఉంటాయని ఆ గ్రామ ప్రజలు అన్నారు. అయితే తురకపట్నం గ్రామంలోనే చెరువు ఉంది కాబట్టి చేపలు పట్టే అధికారం తమకు ఉంటుందని తురకపట్నం గ్రామస్తులు వాదానికి దిగారు.

ఈ క్రమంలో రెండు గ్రామాల ప్రజల మధ్య మాటామాటా పెరిగి, చివరికి గొడవకు దారితీసింది. దీంతో రెండు గ్రామాల ప్రజలు కర్రలతో ఒక్కసారిగా దాడులకు దిగారు. ఈ దాడిలో 12 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారందరినీ ఆసుపత్రికి తరలించారు. కాగా, తాము సామరస్యంగా మాట్లాడుకుందామని చెప్పినా.. పెద్దకోడిపల్లి గ్రామస్తులు వినిపించుకోలేదని తురకపల్లి గ్రామ ప్రజలు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.