కరోనా రాదన్న బాడీ బిల్డర్ దానికే బలి!  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా రాదన్న బాడీ బిల్డర్ దానికే బలి! 

October 19, 2020

ngnhn

ఫిట్‌నెస్‌పై మక్కువతో చాలామంది నిత్యం జిమ్‌కు వెళ్లి చక్కటి దేహ ధారుడ్యాన్ని పొందుతున్నారు. బాడీ బిల్డింగ్ చేస్తూ నిత్యం ఎనర్జీ డ్రింకులు, ప్రొటీన్ షేక్‌లు తాగుతుంటారు. అలాగే శరీరానికి వ్యాయామంతో పాటు విటమిన్లు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు అవసరం అని పళ్లు, కూరగాయలు, ఉడకబెట్టిన గుడ్లు, చికెన్ వంటివి ఎక్కువగా తీసుకుంటుంటారు. అలాంటి వారికి ఏ రోగాలూ రావని అనుకుంటాం. కానీ,  కరోనా అలాంటివారిని కూడా మట్టి కరిపిస్తోంది. బాడీ బిల్డర్లకు కూడా కరోనా సోకి మృతిచెందుతున్న ఘటనలు చూస్తున్నాం. తాజాగా ఉక్రెనియాన్‌కు చెందిన స్టుజుక్ డిమైట్రి (stuzhuk dmitriy) అనే సోషల్ మీడియా సెలెబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ కరోనాకు బలయ్యాడు. 33 ఏళ్ల వయసున్న స్టుజుక్‌కు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. సోషల్ మీడియాలో 11 లక్షల మంది ఫాలోవర్లు కలిగి ఉన్నాడు. 

ఎప్పటికప్పుడు ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలు చేస్తూ, ఏ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో చెప్పే స్టుజుక్‌కు కరోనా సోకి మృతి చెందడాన్ని అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. స్టుజుక్ మృతిని ఆయన మాజీ భార్య సోఫియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. ఎంతో ఫిట్‌నెస్‌తో ఉండే స్టుజుక్, కరోనాతో ప్రాణాలను కోల్పోయాడని చాలా మంది ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. స్టుజుక్ తొలుత కరోనాను చాలా తేలికగా తీసుకున్నాడు. శారీరకంగా పూర్తి ఫిట్‌గా ఉన్నవారు కరోనా బారిన పడరని, ఒకవేళ వైరస్ సోకినా అత్యంత సులువుగా కోలుకోవచ్చని స్టుజుక్ ప్రచారం చేశాడు. చివరికి కరోనా ముందు అతను ఓడిపోయాడు. ఇటీవల టర్కీలో పర్యటించిన అతను తీవ్రమైన కడుపునొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. వెంటనే తన దేశానికి వచ్చి  పరీక్షలు చేయించుకున్నాడు. పరీక్షల్లో అతనికి కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది, డిశ్చార్జ్ కూడా అయ్యాడు. ఆ తరువాత ఉన్నట్టుండి పరిస్థితి విషమించింది. మరోసారి ఆసుపత్రిలో చేరి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టాడు. ‘నాకు కరోనా వచ్చేంత వరకూ ఇటువంటి ఓ వ్యాధి ఉందని నేను నమ్మలేదు. ఈ వైరస్ చాలా బలమైంది. ఇప్పట్లో ప్రపంచాన్ని విడిచి పోదు. అంతం కాని దీనితో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని రియలైజ్ అయి మాట మార్చాడు. ఇక అవే అతని చివరి మాటలు అయ్యాయి. కరోనా సోకదని అన్న స్టుజుక్ ఆ మహమ్మారికి బలవడంతో అతని అభిమానులు సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు.