ఔటర్ రింగురోడ్డులో ఘోరం - MicTv.in - Telugu News
mictv telugu

ఔటర్ రింగురోడ్డులో ఘోరం

October 17, 2017

హైదరాబాద్  ఔటర్ రింగురోడ్డులో ఘోరం చోటుచేసుకుంది. రామచంద్రాపురం మండలం కొల్లూరు దగ్గర మంగళవారం ఐదుగురి మృతదేహాలు కలకలం సృష్టించాయి. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. స్థానికుల తొలుత మహిళల మృతదేహాలను గుర్తించి, నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి గాలించగా దగ్గర్లోని పొదల్లో మరో రెండు మృతదేహాలు కనిపించాయి. వీరెలా చనిపోయారో స్పష్టం కావడం లేదు. ఆత్మహత్య చేసుకున్నారా? లేకపోతే ఎవరైనా చంపేసి అక్కడ పడేసి పోయారా అన్నది తేలడం లేదు.

మృతులది పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్కు చెందిన రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులుగా గుర్తించారు. మృతులను రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులైన లక్ష్మి 48, ప్రభాకర్ రెడ్డి 30, మాధవి 26, వర్షిత్ 2, సింధూజ 16లుగా గుర్తించారు. ప్రభాకర్ రెడ్డి, వర్షిత్ ల మృతదేహాలు వారి వాహనంలో కనిపించాయి. మృతులు పురుగుల మందు తాగి చనిపోయి ఉంటారా? లేకపోతే వాళ్లపై ఎక్కడైనా విషప్రయోగం జరిపి ఆ ప్రాంతంలో పడేసి వెళ్లారా అన్నది తెలియడం లేదు. సంఘటన ప్రాంతంలో కూల్ డ్రింక్స్ కనిపించాయి. వాటిలో విషం కలుపుకుని తాగి ఉండే అవకాశముందని భావిస్తున్నారు. 

ప్రాథమిక సమాచారం ప్రకారం.. వీరంతా సోమవారం  శ్రీశైలానికి వెళ్తున్నట్లు ఇతర కుటుంబ సభ్యులకు, బంధువులకు తెలిపారు. సోమవారం సాయంత్రం శ్రీశైలం నుంచి తిరిగి బయల్దేరుతున్నామని ఫోన్లో తెలిపారు. అయితే వారు ఇంటికి చేరకపోవడం, ఫోన్లు స్విచాఫ్ చేసి ఉండడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా పోలీసులు నమోదు చేశారు. రవీందర్ రెడ్డిని పోలీసు విచారిస్తున్నారు. కుటుంబ పెద్ద అయిన ఆయన వారితో కలసి ఎందుకు వెళ్లలేదు? ఈ మరణాల వెనుక ఆర్థిక కష్టాలు, మరే కారణాలేవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.