ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటుడు నందమూరి రామారావు శత జయంతి ఉత్సవాలకు సంబందించి టాలీవుడ్ నటసింహం, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ కీలక విషయాన్ని అభిమానులకు, కార్యకర్తలకు తెలియజేశారు. ఈ నెల 28నుంచి ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో ఉన్న పెమ్మసాని థియేటర్లో ఎన్టీఆర్ శత జయంతి పేరుతో సంవత్సరం పాటు ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు.
బాలకృష్ణ మాట్లాడుతూ.. “మే 28 నుంచి శత జయంతి ఉత్సవాలు ఏడాది పాటు జరుగుతాయి. మా కుటుంబం నుంచి నెలకు ఒకరు ఒక్కో కార్యక్రమంలో పాల్గొంటారు. శత జయంతి ఉత్సవాల్లో వారానికి ఐదు సినిమాలు, రెండు సదస్సులు నిర్వహిస్తాం. నెలకు రెండు ఎన్టీఆర్ పురస్కారాల ప్రదానోత్సవం ఉంటుంది. తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో శత జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శక పురుషుని శత జయంతి పేరుతో ఈ వేడుకలను నిర్వహిస్తాం” అని ఆయన అన్నారు.