అద్భుత దృశ్యాలతోపాటు మానవాళికి చక్కని సందేశం, హెచ్చరిక.. ఇదీ అవతార్ మూవీ ప్రాజెక్టుల సారాంశం. 2009లో వచ్చిన అవతార్ 1 ప్రపంచవ్యాప్తంగా వేల కోట్లు వసూలు చేసి ప్రేక్షకులకు మరచిపోలేని అనుభూతినిచ్చింది. ఈ నెల 16న విడుదలైన అవతార్ 2 కూడా అదే స్థాయిలో సక్సెస్ టాక్‌తో దూసుకెళ్తోంది. తొలి భాగం ముగిసిన చోట నుంచి రెండో భాగం మొదలై, వాటర్ వరల్డ్ ఇంద్రజాలంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. పార్ట్ 2ను మరింత బాగా ఎంజాయ్ చేయాంటే పార్ట్ 1లో ఏం జరిగిందో ఓసారి గుర్తుచేసుకోవాలి. ఈ కింది నాలుగు పాయింట్లను గమనిస్తే ‘ద వే ఆఫ్ వాటర్’లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వొచ్చు.
1. భూమికి కొన్ని కాంతిసంత్సరాల దూరంలోని పండోరా గ్రహంపై నవీ అనే నీలిరంగు జాతి ప్రజలు ఉంటారు. 30 అడుగుల ఎత్తు, తోక, ప్రకృతి ఆరాధన వాళ్ల ప్రత్యకతలు. ఆ గ్రహంలో అందమైన, భయంకరమైన జంతువులనేకం ఉంటాయి. అక్కడ దొరికే అనబ్టేనియం అనే ఖనిజం కోసం ఆర్డీఏ అనే కంపెనీ 2154వ సంవత్సరంలో అవతార్ ప్రాజెక్టు చేపడుతుంది.
2. టామ్ అనే వ్యక్తి అందులో భాగం. నవీలు మనుషులను ప్రతిఘటిస్తారు. దీంతో కంపెనీ భూమ్మీది మనుషుల డీఎన్ఏతో నవీల డీఎన్ఏ కలిపి అవతార్లను తయారు చేస్తుంది. టామ్ ఆ ప్రాజెక్టులో చనిపోవడంతో అతని సోదరుడు జేక్ సల్లీ వెళ్లి అవతార్ అవుతాడు. అంతకుముందు జేక్ నేవీలో పనిచేసి ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకుని ఉంటాడు.
3. పండోరాను ఆక్రమించుకోడానికి అక్కడి ప్రజలతో సంబంధాలు పెట్టుకోవాలని కంపెనీ జేక్‌ను పంపుతుంది. అయితే జేక్ వారి నిస్సార్థ జీవనవిధానికి ఆకర్షితుడవుతాడు. నేతిరి అనే నవీని ప్రేమించి, కంపెనీపై తిరగబడతాడు. నవీలు పవిత్రంగా పూజించే చెట్టును కాపడ్డానికి భీకర యుద్ధం చేస్తాడు.
4. జేక్ తమకు ఎదురుతిరగడంతో కంపెనీ అతని అవతార్‌ను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుంది. నేతిరి మొదట్లో అతణ్ని అనుమానించినా తర్వాత మనుషులతో జరిగే యుద్ధంలో అతడు పాల్గొనడం చూసి నమ్ముతుంది. నవీల కోసం తాను శాశ్వతంగా అవతార్లాగే ఉండిపోవాలనుకుంటాడు జేక్. వీరికి పిల్లలు పుట్టడం, కంపెనీ జేక్ కుటుంబాన్ని అంతమొందించడానికి ప్రయత్నించడం, నీటిలో జీవించే నవీలతో జేక్ కలసిపోవడం, వారిపై కంపెనీ మరింత భీకరంగా దాడిచేయడంత అవతార్ 2లోని కథ.