Five killed, 20 injured after lorry hits tractor in Suryapet
mictv telugu

పడిపూజకు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

November 13, 2022

సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 65వ జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో వెళ్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. శనివారం రాత్రి మునగాల మండల కేంద్రానికి చెందిన పలువురు సాగర్ ఎడమ కాలువ ఆయప్ప ఆలయంలో జరిగిన మహాపడిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు. పూజ అనంతరం అర్ధరాత్రి 12 గంటలకు ట్రాక్టర్‌లో తిరుగు ప్రయాణమయ్యారు.

అయితే అయ్యప్ప ఆలయానికి యూటర్న్ ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉండడంతో డ్రైవర్ దూరం తగ్గించేందుకు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో ట్రాక్టర్‌ను తీసుకెళ్లాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.