వడదెబ్బతో తెలంగాణలో ఐదుగురి మ‌ృతి.. ఆరెంజ్ అలర్ట్ జారీ - MicTv.in - Telugu News
mictv telugu

వడదెబ్బతో తెలంగాణలో ఐదుగురి మ‌ృతి.. ఆరెంజ్ అలర్ట్ జారీ

May 3, 2022

తెలంగాణలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది వేసవి మొదలైనప్పటి నుంచి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడగా, ఇప్పుడు వడదెబ్బతో మృతి చెందడం ప్రారంభమైంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో ఐదుగురు మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. అదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం రాజులగూడకు చెందిన ఆరేళ్ల బాలుడు గుణాజీ, అదే గ్రామంలోని ఆర్ఎంపీ బాలాజీ (45), బోధ్ మండలంలో నిర్మాణ కూలీ (32), సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటూరుకు చెందిన రైతు తిగుళ్ల అంజయ్య (48), యాదాద్రి జిల్లా భువనగిరి మండలం రెడ్డినాయక్ తండాకు చెందిన బుజ్జమ్మ (45) మృతి చెందారు. ఈ ఎండలు ఇంకా నాలుగు రోజులు ఉంటాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న అత్యధిక ఉష్ణోగ్రత అదిలాబాద్‌లోని భోరజ్‌లో 44.5 డిగ్రీలుగా నమోదైంది. ఇదిలా ఉండగా, విదర్భ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, అక్కడక్కడా వర్షం పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.