లారీ బోల్తాపడి ఐదుగురు కూలీలు మృతి.. హైదరాబాద్ నుంచి ఆగ్రా వెళ్తూ.. - MicTv.in - Telugu News
mictv telugu

లారీ బోల్తాపడి ఐదుగురు కూలీలు మృతి.. హైదరాబాద్ నుంచి ఆగ్రా వెళ్తూ..

May 10, 2020

Five Migrant Workers Killed, 13 Injured as Truck Carrying Them Overturns in MP

లాక్‌డౌన్‌తో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చేతిలో పనిలేక ఆకలితో అలమటిస్తున్నారు. సర్కార్ అందిస్తున్న సాయం కొందరికి చేరడంలేదు. దీంతో వారు అటు అయినవాళ్ల దగ్గరికి వెళ్లలేక ఇక్కడ ఉండలేక బిక్కుబిక్కుమంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వలస కూలీలను వారి వారి స్వస్థలాలకు పంపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడా వారే బలి అవుతున్నారు. ఆనందంగా ఎవరి స్వస్థలాలకు వారు తిరుగుముఖం పడుతుండగా రోడ్డు ప్రమాదాలకు, ఎండదెబ్బకు వలస కార్మికులు వరుసగా మృత్యువాత పడుతున్న ఘటనలు చూస్తున్నాం. తాజాగా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 18 మంది వలస కార్మికులు హైదరాబాద్ నుంచి మామిడిపండ్ల లోడుతో బయలుదేరిన లారీ ఎక్కారు. శనివారం ఉదయం బయలుదేరిన ఈ లారీ ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాకు వెళ్తుండగా.. మార్గమధ్యలో మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లా పథా గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై బోల్తా పడింది. 

ఈ ఘటనలో కార్మికులు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడ్డారు. వారిలో అయిదుగురు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా.. మిగిలినవారు గాయపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే నర్సింగ్‌పూర్ జిల్లా కలెక్టర్ దీపక్ సక్సేనా, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన జబల్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారితో మృతదేహాల నుంచి శాంపిళ్లను సేకరించి కరోనా పరీక్షలకు పంపామని కలెక్టర్ తెలిపారు. కాగా, మొన్న మహారాష్ట్రలో గూడ్స్ బండి దూసుకెళ్లడంతో 15 మంది వలస కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఆ ఘటన గురించి మరిచిపోక ముందే మరో ప్రమాదం సంభవించడం తీవ్ర కలకలం రేపుతోంది.