నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏర్పాటు చేసిన సభలో విషాదం చోటుచేసుకుంది. విపరీతమైన రద్దీ నెలకొనడంతో పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగి ఐదుగురు దుర్మరణం చెందారు. పలువురు కార్యకర్తలు రోడ్డు పక్కనే ఉన్న గుండం కట్ల అవుట్ లెట్ కాలువలో పడిపోగా, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. దీంతో సభను నిలిపివేసిన చంద్రబాబు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఐదుగురు చనిపోయారని తెలుస్తోందని, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలా జరగలేదని వాపోయారు.
మరో ఆరుగురు చికిత్స పొందుతున్నారని, మరణించిన కార్యకర్తల కుటుంబాలకు పది లక్షల చొప్పున పార్టీ తరపున సాయం అందిస్తామని ప్రకటించారు. ఎప్పుడు కందుకూరు వచ్చినా ఆస్పత్రి సెంటర్ లోనే సభ పెడతానని, కానీ కొన్ని సందర్భాల్లో మనం నిమిత్తమాత్రులం అవుతామని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సభ సాధ్యం కాదంటూ మరణించిన వారికి సంతాపంగా రెండు నిమిషాల మౌనం పాటించారు. అనంతరం సభను అర్ధాంతరంగా ముగించారు. కాగా, మరణించిన వారిని గుడ్లూరు మండలం అమ్మవారి పాలెం చిన కొండయ్య, కందుకూరు పట్టణం గుర్రంవారి పాలెంకి చెందిన కాకుమాని రాజాగా గుర్తించగా, మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. తొక్కిసలాట అనంతరం ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో నిండిపోయింది.