Five Wickets Fall In One Over In The Australian Women’s Domestic League Final
mictv telugu

wncl final match : లక్ష్యం 6 బంతుల్లో 4 పరుగులు..చేతిలో 5 వికెట్లు..చివరికి ఆలౌట్ (వీడియో)

February 26, 2023

Five Wickets Fall In One Over In The Australian Women’s Domestic League Final

క్రికెట్ లో ఏదైనా సాధ్యమే అని మరోసారి నిరూపితమైంది. విజయం తథ్యం అనుకునే సమయంలో మ్యాచ్ ఊహించని మలుపు తిరిగింది. చివరికి నమ్మశక్యంకాని రీతిలో మ్యాచ్ ఫలితం వెలువడింది.

ఆస్ట్రేలియాలో ఉమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్ ఫైనల్ మ్యాచ్‎లో భాగంగా సౌత్ ఆస్ట్రేలియా, టస్మానియా జట్లు తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన టస్మానియా 50 ఓవర్లకు 264 పరుగులు చేసింది.అనంతరం 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆస్ట్రేలియా 44 ఓవర్లలో 5 వికెట్లకు 220 పరుగులు చేసింది. ఈ సమయంలో కురిసిన వర్షం మ్యాచ్‌కు అడ్డంకిగా మారింది. దీంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం టార్గెట్‌ను 47 ఓవర్లలో 243 పరుగులుగా నిర్ణయించారు. చివరికి 6 బంతుల్లో 4 పరుగులు చేయాల్సి వచ్చింది. చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి. అప్పటికే క్రీజ్‌లో కుదురుకున్న బ్యాట్స్‌మెన్లు ఉండడంతో విజయం నల్లేరుపై నడక అనుకున్నారంతా..కానీ ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపం మారిపోయింది.

సారా కొయ్ టే వేసిన లాస్ట్ ఓవర్‌లో సౌత్ ఆస్ట్రేలియా జట్టు ఐదు వికెట్లు కోల్పోయి..ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూసింది. తొలి బంతికే జోరుమీదున్న అన్నీ ఓ నీల్‌ను బౌల్డ్ చేసి షాకిచ్చింది సారా కొయ్ టే. రెండో బంతికి ఒక పరుగు రాగా.. మూడు, నాలుగు బంతుల్లో స్టంపౌట్, రనౌట్ రూపంలో రెండు వికెట్లు దక్కాయి. ఐదో బంతికి కూడా ఎల్లా విల్సన్ ఎల్‎బీడబ్ల్యూ అయింది. దీంతో సమీకరణం చివరి బంతికి మూడు పరుగులుగా మారిపోయింది. కానీ చివరి బంతికి ఒక్క పరుగే వచ్చింది. రెండో పరుగు కోసం ప్రయత్నించి ముషంగ్వే రనౌట్ అవ్వడంతో టస్మానియా ఆటగాళ్ళు ఆనందలో ఎగిరిగెంతేశారు.