ఫ్లెమింగో బాబుకు షూలు వేశారు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్లెమింగో బాబుకు షూలు వేశారు..

August 19, 2017

సింగపూర్ జూలో ఆ చిన్నారిని చూడ్డానికి జనం ఎగబడిపోతున్నారు. నీలిరంగు షూలతో ఆ బాబు అటూ ఇటూ తిరుగుతోంటే అబ్బురంగా చూస్తూ ఆబాలగోపాలం కేరింతలు కొడుతున్నారు.. ఇంతకూ ఆ బాబు ఎవరంటే ఓ ఫ్లెమింగో!

కొన్ని నెలల కిందటే జన్మించిన ఈ మగ ఫ్లెమింగో ఇటీవలి వరకు జూలోని కాంక్రీట్ నేలపై తిరుగుతూ చాలా ఇబ్బంది పడిందట. ఎండకు కాళ్లు మంటలెక్కి బొమ్ము లేచాయట. దీంతో సమస్య పరిష్కారం కోసం జూ సిబ్బంది ఈ ఫ్లెమింగో కోసం బుల్లి షూస్ తయారు చేశారు.

పొద్దునే దానికి ఇలా జాగ్రత్తగా షూలు తొడిగి జూలోకి తీసుకెళ్తుంటారు. అది ఏదో బడాయి పోతున్నట్లు చకచకా అడుగులేస్తూ సిబ్బంది వెంట నడుస్తుంటే చూడ్డానికి కళ్లు చాలవు.

ఫ్లెమింగోలకు సహజ ఆవాసమైన దక్షిణ అమెరికా ఖండంలో వాతావరణం కాస్త చల్లగా ఉంటుంది. దాంతో ఫ్లెమింగోలకు సమస్య ఉండదు. వేడి దేశాల్లో వాటి బాధ చెప్పనలవి కాదు. ఎప్పుడూ నీటిలోనే ఉంటే జబ్బు చేస్తుంది కనుక అవి సూర్యరశ్మ కోసం బయటికొస్తుంటాయి.