భూమి గుండ్రంగా లేదని నిరూపిస్తానని ఇలా మృతి - MicTv.in - Telugu News
mictv telugu

భూమి గుండ్రంగా లేదని నిరూపిస్తానని ఇలా మృతి

February 24, 2020

Flat-Earther Mad Mike Rocket Failed

భూమి బల్లపరుపుగా ఉందా.. గుండ్రాంగా ఉందా.. అనే అంశంపై అనేక చర్చలు జరిగాయి. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా సాంకేతికత పెరిగిపోవడంతో శాటిలైట్ ద్వారా భూమి గుండ్రంగా ఉన్నట్టుగా తేల్చారు ఖగోళ శాస్త్రవేత్తలు. అయినప్పటికీ కొంత మంది ఔత్సాహికులు మాత్రం భూమి బల్లపరుపుగానే ఉందని ఇంకా వితండ వాదం చేస్తూనే ఉన్నారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా అమెరికాకు చెందిన ఔత్సాహిక వ్యోమగామి భూమి బల్లపరుపుగా ఉందని నిరూపించబోయి ప్రాణాలు వదిలాడు. 

 మైకేల్ హ్యూస్ అలియాస్ మ్యాడ్ మైక్ అనే ఓ స్టంట్ మేన్ మాత్రం భూమి బల్లపరుపుగా ఉందని నిరూపించాలని అనుకున్నాడు. దీని కోసం అతనే స్వయంగా ఓ రాకెట్ కూడా తయారు చేసుకున్నాడు. దీనికి కొంత మంది ఆర్థిక సాయం కూడా చేశారు. అంతా సిద్ధం కావడంతో కాలిఫోర్నియాలోని బార్ స్టో కేంద్రంగా నింగిలోకి రాకెట్ దూసుకెళ్లింది. భూమి నుంచి 1500 మీటర్ల ఎత్తుకు వెళ్లి భూమి గుండ్రంగా లేదని, చదరంగా ఉందని నిరూపించాలనుకున్నాడు. కానీ అంతలోనే విషాదం చోటుచేసుకుంది. 

రాకెట్ ప్రయోగం వికటించి నింగిలోకి ఎగిరిన కొద్దిసేపటికే పేలిపోయింది. మైకేల్ హ్యూస్ పారాచూట్ తో తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఈ దుర్ఘటనలో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అందరి కళ్లముందే రాకెట్ కుప్పకూలిపోయే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.