పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా శుక్రవారం విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాకు సంబంధించి శనివారం చిత్రబృందం సక్సెస్ మీట్‌ను కూడా నిర్వహించింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు రీమేక్‌గా ‘భీమ్లా నాయక్’ డైరెక్టర్ సాగర్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల సమయంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో పవన్ అభిమానులు భారీ కటౌట్లు, ఫ్లక్సీలను ఏర్పాటు చేశారు. అయితే, విజయవాడలో ఓ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ప్రస్తుతం ఏపీ మొత్తంచర్చనీయాంశంగా మారింది.
కృష్ణలంకలో అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ సంచలనం రేపుతుంది. ఈ ఫ్లెక్సీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, వంగవీటి మోహనరంగా, పవన్ కళ్యాణ్ ఫొటోలతో భారీ ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. మధ్యలో కేటిఆర్, తలసాని, వంగవీటి రాధాకృష్ణ, నాదెండ్ల మనోహర్ చిత్రాలు కూడా ఉన్నాయి. కేసిఆర్‌ను ఉద్దేశించి హ్యాట్సాఫ్ సీఎం సార్ అంటూ దానిపై రాయించారు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ విజయవాడలో చర్చనీయాంశంగా మారింది.
మరోపక్క ఏపీలో భీమ్లానాయక్ సినిమాకు ప్రభుత్వం ఐదో షోకు అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. టికెట్ రేట్లను కూడా అక్కడ పెంచలేదు. దాంతో కొందరు అభిమానులు ఏపీ ప్రభుత్వం కావాలనే పవన్ సినిమాపై కక్ష సాదిస్తుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆంక్షలతో ఇబ్బందులు పెడుతున్న ఏపీ ప్రభుత్వానికి కౌంటర్‌గానే విజయవాడలో ఇలా ఫ్లెక్సీఏర్పాటు చేశారనే ప్రచారం జరుగుతుంది.