మంచు తుఫానుతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. భారీ హిమపాతంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. రవాణా వ్యవస్థ స్థంభించిపోవడంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. రోడ్లపై మంచు భారీగా పేరుకుపోవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బుధవారం ఒక్కరోజే సుమారు 1500 విమానాలను రద్దు చేశారు. 5 వేలకు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. హిమపాతం కారణంగా విద్యుత్ వ్యవస్థకు అంతరాయం కలిగి కాలిఫోర్నియా ప్రజలంతా చీకట్లో బిక్కుబిక్కుమంటున్నారు. అరిజోనా నుంచి వ్యోమింగ్ వరకు ఉన్న అంతర్రాష్ట్ర రహదారులు మూతపడ్డాయి. మిడ్ వెస్ట్, మిడ్ అట్లాంటిక్, ఆగ్నేయ ప్రాంతాల్లోని నగరాల్లో చరిత్రలో తొలిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామని స్థానికులు అంటున్నారు. అనేక చోట్ల పాఠశాలలు, కళాశాలలు, ఆఫీసులతో పాటు మిన్నెసోటా అసెంబ్లీని కూడా మూసేయాల్సి వచ్చింది.