Flight delayed by six hours over mobile chat between couple in Mangaluru
mictv telugu

గర్ల్‌ఫ్రెండ్‌తో చాటింగ్.. దెబ్బకు ఆగిపోయిన విమానం

August 15, 2022

ఓ అబ్బాయి.. అమ్మాయి మధ్య సరదాగా జరిగిన ఓ మొబైల్‌ చాటింగ్.. టేకాఫ్ అవ్వాల్సిన విమానాన్ని ఏకంగా ఆరు గంటల పాటు ఆపేసింది. ఆదివారం సాయంత్రం మంగళూరు నుంచి ముంబైకి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు.. తన ముందు సీట్లో కూర్చున్న తోటి ప్రయాణికుడికి వచ్చిన ఫోన్ మెసేజ్ చూసి ఆందోళన వ్యక్తం చేసింది. ఆ మెసేజ్ గురించి వెంటనే విమాన సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోలర్‌ను అప్రమత్తం చేశారు. దీంతో టేకాఫ్ అవ్వాల్సిన విమానం ఆగిపోయింది. విమానాశ్రయ సిబ్బంది వెంటనే మొత్తం 185 ప్రయాణికులందరినీ దించేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ప్రయాణికులందర్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ప్రయాణికులను ముంబై వెళ్లే విమానంలోకి తిరిగి అనుమతించారు. దీంతో ఉదయం 11 గంటలకు బయల్దేరాల్సిన విమానం సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరింది.

ఇంతకీ ఆ మెసేజ్ ఏంటంటే..

ఆ అబ్బాయి తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి నిన్న మంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అబ్బాయి ముంబయి వెళ్లేందుకు.. అమ్మాయి బెంగళూరు వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్‌ చేసుకున్నారు. ముంబయి వెళ్లే విమానం రాగానే అబ్బాయి వెళ్లి విమానంలో కూర్చున్నాడు. అమ్మాయేమో తన విమానం కోసం ఎదురుచూస్తోంది. ఖాళీగా ఉన్న వారిద్దరూ ఆ సమయంలో మొబైల్‌లో చాట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా విమానాల్లో భద్రత గురించి సరదాగా మాట్లాకుంటూ ‘నువ్వే ఓ బాంబర్‌’ అంటూ ఆ అమ్మాయి.. అబ్బాయికి మెసేజ్‌ చేసింది. వెనుక కూర్చున్న మహిళ ప్రయాణికురాలి కంట్లో ఈ మెసేజ్ పడడంతో నానా రచ్చ జరిగింది.