Floating freezer helps Brazilian man stay afloat in Atlantic Ocean for 11 days
mictv telugu

నీరు, ఆహారం లేకుండా నడిసముద్రంలో 11 రోజుల పాటు ఒంటరి పోరాటం

September 5, 2022

ఎవరూ లేని ప్రదేశంలో ఒంటరిగా గడపడమే చాలా కష్టం.. అలాంటిది నడిసముద్రంలో ఓ వ్యక్తి 11 రోజులపాటు నీరు, ఆహారం లేకుండా తన ప్రాణాలను కాపాడుకునేందుకు గట్టి ప్రయత్నమే చేసి చివరకు చావు నుంచి బయటపడ్డాడు. వివరాలిలా.. బ్రెజిల్‌కు చెందిన రోములాడో మసిడో రోడ్రోగస్‌ అనే వ్యక్తి ఆగస్టులో చేపల వేటకని పడవపై అట్లాంటిక్‌ సముద్రంలోకి వెళ్లాడు. కానీ, దురదృష్టవశాత్తు కొద్ది సేపటికే అతడి పడవ మునిగిపోవడం మొదలుపెట్టింది.
ఆ సమయంలో ప్రాణాలు కాపాడేకునేందుకు అతడి పడవలోని ఫ్రీజర్‌ పైకి దూకాడు. అది ఒకవైపునకు ఒరిగిపోయినా.. తేలుతూనే ఉంది. దాదాపు 11 రోజులు నీరు, ఆహారం లేకుండా దానిపైనే గడిపాడు. ఒక దశలో ఫ్రీజర్‌లోకి నీరు చేరుతుండటంతో.. చేత్తోనే వాటిని ఎత్తి బయటపోశాడు. కొన్ని సార్లు షార్క్‌ చేపలు ఆ ఫ్రీజర్‌ చుట్టూ తిరిగాయి కూడా. చివరికి వేరే చేపల పడవ ఆ ఫ్రీజర్‌ సమీపంలోకి వచ్చింది. తొలుత అందులోని వారు అది ఖాళీ ఫ్రీజర్‌ అనుకొన్నారు.
కానీ, రోడ్రిగో వాళ్లకు కనిపించేలా కాళ్లు చేతులు కదిపాడు కూడా. చివరికి సురినామ్‌ అనే దక్షిణ అమెరికా దేశం తీరంలో అతడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. అతడు సముద్రంలో మునిగిపోయిన ప్రాంతానికి ఇది 280 మైళ్ల దూరంలో ఉంది. ఈ ప్రయాణంలో అతడు దాదాపు ఐదు కిలోల బరువు కోల్పోయాడు. ఎండ, గాలీ కారణంగా అతడి శరీరం బలహీనంగా మారిపోయింది. పత్రాలు లేని కారణంగా సురినామ్‌ పోలీసులు అతడిని రెండు వారాల కస్టడీ అనంతరం విడుదల చేశారు.