హైదరాబాద్ సీపీ ఇంట్లో నీళ్లు.. ఇదీ సీన్ - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ సీపీ ఇంట్లో నీళ్లు.. ఇదీ సీన్

October 15, 2020

flood at hyderabad cp anjani kumar yadav home

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం తడిసి ముద్దైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. సామాన్యులతో పాటు ప్రముఖుల ఇళ్లలోకి కూడా నీళ్లు వచ్చాయి. వారిలో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్ ఒకరు.‌ ఆయన ఇంట్లోకి వరద నీరు చేరడంతో గత నాలుగు రోజులుగా ఆయన ఆఫీసులోనే ఉంటూ డ్యూటీ చేస్తున్నారు. మరో 300 మంది పోలీసు అధికారుల ఇళ్లలోకి కూడా వరద నీరు వచ్చింది. 

ప్రస్తుత పరిస్థితి గురించి సీపీ అంజనీకుమార్ యాదవ్ మాట్లాడుతూ..’వరద సహాయక చర్యల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. మూసి లోతట్టు ప్రాంతంలో కొన్ని చోట్ల వరద నీరు ఉంది. కుల్సుంపుర, కార్వాన్, తప్పాచపుత్ర, అఫ్జల్‌గంజ్‌, మలక్‌పేట్‌, చాదర్‌ఘాట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం వరద ఉధృతి ఎక్కువగా ఉంది. ఫలక్‌నామా ఏరియాలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. ముంపు ప్రాంతాల్లో పోలీసులు విస్త్రృత సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆర్మీ కూడా రంగంలోకి దిగింది.’ అని అన్నారు. 

అలాగే వరద సహాయక చర్యలు పాల్గొన్న కానిస్టేబుల్ వీరేందర్‌ను ప్రశంసిస్తూ గురించి అంజనీకుమార్ యాదవ్ ట్వీట్ చేశారు. ‘చిక్కడ్‌పల్లి పోలీస్‌ కానిస్టేబుల్‌ వీరేందర్‌ నా హీరో. అరవింద్‌ నగర్‌, దోమలగూడ వద్ద వరద నీటిలో చిక్కుకుపోయిన 25 మందిని ఆయన కాపాడారు. ఇలాంటి ఆఫీసర్లే మా బృందంలో ఉన్న నిజమైన స్టార్లు. ఆయనకు సెల్యూట్‌ చేస్తున్నా. అలాగే హైదరాబాద్‌ పోలీసులకు ప్రోత్సాహం అందిస్తున్న ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు’ ట్వీట్‌లో పేర్కొన్నారు.