వరద విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు బలి - MicTv.in - Telugu News
mictv telugu

వరద విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు బలి

October 18, 2020

Flood hit Gaganpahad Shamshabad, 4 Member of Family swept away.jp

నిత్యం ఉరుకులు, పరుగులతో సాగుతున్న నగర జీవితాల్లో ఊహించని ఉత్పాతం. మొగులుకి చిల్లు పడిందా అన్నట్టు భారీ వాన కురిసి రోడ్లు సెలయేళ్లను తలపించాయి. ఇంత భారీ వానను ప్రజలు ఎప్పుడూ చూడలేదు. ఓ గంట కురిసి వెలిసిపోతుందని అనుకున్నారు. తగ్గాక ఇంటికి వెళ్లిపోదాం అనుకున్నారు. కానీ, దయ్యంలా పట్టిన ముసురు తగ్గదే. జయ్‌మని భీకర శబ్దంతో వాన అదేపనిగా కురిసింది. ఇళ్లను, భవనాలను ముంచేసింది. దీంతో చాలామంది వాహనాల్లోనే కొట్టుకుపోయారు. కార్లలో కొట్టుకుపోయి ఇప్పటికే ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. ఇళ్లు కూలిపోయి చిన్నారులు, మహిళలు, వృద్ధులు చనిపోతున్నారు. పాతబస్తీ ప్రాంతంలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో అటు బాధితుల సంఖ్య పెరిగింది. కరోనా వైరస్ బారినుంచి తమనితాము కాపాడుకుంటున్నవారి మీద వరద మరో కోలుకోలేని దెబ్బ కొట్టింది. 

మంగళవారం రోజు రాత్రి గగన్ పాడు అప్ప చెరువు గండి పడటంతో ఆ వరద నీటిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వారిలో ముగ్గురు కరిమా బేగం, అమీర్ ఖాన్, సాహిల్(4) మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొక మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఇవాళ  నగర శివారు శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని  గగన్ పహాడ్ చౌరస్తాలో ఉన్న సెలబ్రిటీ ఫంక్షన్ హాల్ వద్ద చెట్ల పొదల్లో బాలుడి మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు.  వెంటనే శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బాలుడి మృతదేహాన్ని వరదల్లో కొట్టుకుపోయిన నాలుగో వ్యక్తి అయాన్(7)గా గుర్తించారు. కాగా, అయాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి  తరలించారు.