భారీ వర్షాలు.. కుటుంబానికి రూ. 2 వేల నగదు : జగన్ ఆదేశం
దేశ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పలు చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నదీ తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజల ఇబ్బందులైతే వర్ణనాతీతం. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముంపు ప్రాంతాల నుంచి సహాయక శిబిరాలకు తరలించిన కుటుంబాలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
అంతేకాక, వర్షాలు తగ్గాక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లిపోయేటప్పుడు ప్రతీ కుటుంబానికి రూ. 2 వేలు నగదు అందజేయాలని ఆదేశించారు. దీనివల్ల బాధిత కుటుంబాలకు తక్షణ అవసరాలకు డబ్బు అందుతుందని పేర్కొన్నారు. అలాగే అల్లూరి, ఈస్ట్ గోదావరి, ఏలూరు, అంబేద్కర్ జిల్లాల కలెక్టర్లకు రూ. 2 కోట్ల చొప్పున నిధులను తక్షణం అందించారు. గోదావరి వరదల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, విద్యుత్తు సిబ్బంది ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలని కోరారు. వరద సమయంలో రోజువారీ నివేదిక పంపాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదని తెలిపారు.