Flood victims will get Rs. 10 thousand financial assistance, new colony with a thousand crores: CM KCR
mictv telugu

ముంపు బాధితులకు రూ. 10వేల తక్షణ సాయం, రూ. 1000కోట్లతో కాలనీలు..

July 17, 2022

భద్రాచలం ముంపు బాధితులకు రూ.1000 కోట్లతో శాశ్వత కాలనీలు నిర్మిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. భద్రాచలం పట్టణంలో వరద పరిస్థితిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడారు. వరదలు వచ్చినప్పుడల్లా భద్రాచలం వాసులు ముంపునకు గురికావడం బాధాకరమని కేసీఆర్ అన్నారు. శాశ్వత కాలనీల నిర్మాణం కోసం ఎత్తైన ప్రదేశాలను గుర్తించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.

భద్రాచలం వద్ద గోదావరికి భారీగా వరద వచ్చినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నందుకు సీఎం అభినందించారు. భధ్రాచలం, బూర్గుంపహాడ్ 25 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టుగా చెప్పారు. ఈ నెల 29వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుందన్నారు. దీంతో పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని అత్యవసరంగా ఇళ్లకు తరలించవద్దని సీఎం ఆదేశించారు. వరద ముంపు బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. వచ్చే రెండు మాసాలు ప్రతి కుటుంబానికి 20 కిలోల బియ్యం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.

సుభాష్ నగర్, ఎఎంసీ కాలనీలు, కొత్త కాలనీల వాసులను ఇక్కడి నుండి తరలించాలని సీఎం కోరారు. వీరి కోసం వెయ్యి కోట్లతో శాశ్వతంగా భవనాలు నిర్మిస్తామని కేసీఆర్ తెలిపారు. సింగ‌రేణి, ప్ర‌భుత్వం క‌లిసి రూ. 1000 కోట్ల‌తో రెండు, మూడు వేల ఇండ్ల కాల‌నీ నిర్మించ‌బోతున్నామని తెలిపారు. ఈ విషయమై సీఎస్ సోమేష్ కుమార్ చర్యలు తీసుకొంటారని చెప్పారు. పినపాక, భద్రాచలం ప్రాంతాల్లో శాశ్వత కాలనీలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. గోదావ‌రికి 90 అడుగుల మేర వ‌ర‌ద వ‌చ్చినా ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు చేప‌డుతామన్నారు.