కరోనా అంటించిన డాక్టర్.. కోర్టుకెక్కిన నర్సమ్మ - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా అంటించిన డాక్టర్.. కోర్టుకెక్కిన నర్సమ్మ

October 26, 2020

Florida Nurse Case on Doctor

కరోనా అంటించాడంటూ ఓ డాక్టర్‌పై నర్సు ఫిర్యాదు చేసింది. వ్యాధి అంటించాలనే ఉద్దేశ్యంతోనే అలా చేశాడని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ వేసింది. పీపీఈ కిట్ ఇవ్వాలని కోరినందుకు వైరస్ అంటించాడని ఆరోపించింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లొరిడా‌లో చోటుచేసుకుంది.  ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న తర్వాత ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో కోర్టు ఏ విధమైన పరిష్కారం చూపిస్తుందనేది ఆసక్తిగా మారింది. 

వెనిస్ జీన్ బాప్టిస్ట్ అనే నర్సు డాక్టర్ జోసెఫ్ పిపెరాటో వద్ద నర్సుగా పని చేస్తోంది. అతడు గత మార్చి నెలలో మియామి బీచ్‌లో జరిగిన డ్యాన్స్ ఫెస్టివల్‌కు వెళ్లి వచ్చాడు. అనారోగ్య లక్షణాలు ఉండటంతో కరోనా టెస్టులు చేయించుకోవాలని నర్సు సూచించింది. అంతే కాకుండా ముందు జాగ్రత్తగా తమకు పీపీఈ కిట్లు కూడా ఇవ్వాలని కోరింది. ఆ మాటతో విసుగు చెందిన అతడు ఆమె వైపు తిరిగి దగ్గాడు. నాకు కరోనా ఉంటే.. నీకు కూడా వచ్చేస్తోంది అని హేళన చేశాడు. అది జరిగిన కొన్ని రోజులకే ఆమె వ్యాధిబారిన పడింది. ఆమె రెండేళ్ల కొడుక్కు కూడా సోకింది. కొన్ని  రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకొని కోలుకుంది. తనకు ఆ పరిస్థితి తీసుకువచ్చిన  డాక్టర్ నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ వేసింది. ఆ డాక్టర్ మాత్రం నర్సు చేస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నాడు.