బట్ట అనుకుని పామును ఉతికేసిన మహా ఇల్లాలు..  - MicTv.in - Telugu News
mictv telugu

బట్ట అనుకుని పామును ఉతికేసిన మహా ఇల్లాలు.. 

August 10, 2020

Florida Woman Finds Python in Washing Machine After Mistaking it For Snake Print Garment.

చిరుతలను, పాములను పోలిన డిజైన్లలో బట్టల రంగులు ఉంటున్నాయి. దీంతో ఆ బట్టల్లో అప్పుడప్పుడు పాములు, పులులు వచ్చి చేరినా పోల్చుకోలేకపోతున్నారు కొందరు. ఈ క్రమంలో ఓ మహిళ పామును కూడా పోల్చుకోలేకపోయింది. ఎంచక్కా దానిని వాషింగ్ మెషీన్‌లో ఉతికి ఆరేసింది. అనవసరంగా ఈ ఇంటికి వచ్చి ఈమె చేతిలో ఇలా వాషింగ్ మెషీన్‌లో చిత్తడి  అయిపోతున్నాను అనుకుని పాపం పాము చావు నోట్లోకి వెళ్లొచ్చినట్టు ఫీల్  అయిపోయింది. ఈ సంఘటన ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో చోటుచేసుకుంది. ఎమిలీ అనే మహిళ రోజూ మాదిరిగానే దుస్తులు ఉతకడానికి సిద్ధం అయింది. అక్కడున్న మైల బట్టలను చకచకా వాషింగ్ మెషీన్‌లో వేస్తోంది. అప్పటికే ఆ బట్టల్లో నిద్రపోతున్న కొండ చిలువను దుప్పటి డిజైన్ అనుకుని పొరబడింది. దానిని కూడా చక్కగా వాషింగ్ మిషన్‌లో వేసేసింది. 

సర్ఫు, సువాసనలు వెదఝల్లే పౌడర్ కూడా వేసి స్విచ్ ఆన్ చేసింది. మెషీన్ గిర్రున తిరుగుతుంటే ఆమె కాసేపు ఆ పనులు ఈ పనులు చూసుకుంది. ఈలోపు అందులో ఉన్న పాము ప్రాణాలు గిరగిరా తిరిగి ఉసూరుమన్నాయి. బట్టలు ఉతకడం అయిపోయిందని మిషన్ సిగ్నల్ ఇవ్వగానే.. వెళ్లి బట్టలు అందులోంచి తీసి ఎండకు ఆరబెడదామనుకుంది. అలా దుస్తులను బయటకు తీస్తుంటే.. ఆమె చేతికి పాము మెత్తగా, వెచ్చగా తాకింది. అంతే.. ఎగిరి గంతేసింది. వెంటనే తన చేతిలో ఉన్న కొండ చిలువను మళ్లీ వాషింగ్‌ మెషీన్‌లో పారేసి కుమ్యోమొర్రో అని బయటకు పరుగెత్తి అపార్ట్‌మెంట్ మెయింటెనెన్స్ సిబ్బందిని పిలిచింది. అప్పటికే అది మిషన్‌లో గిరగిరా తిరగడంతో దాని ప్రాణాలు గాబరా అవుతున్నాయి. వెంటనే సెక్యూరిటీవారు అక్కడికి వచ్చి కొండ చిలువను బంధించి, అనంతరం దానిని అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఈ ఘటనపై ఎమిలీ మాట్లాడుతూ.. ‘అది బట్టల్లోకి ఎలా దూరిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. తలుపులన్నీ మూసే ఉన్నా అది ఎక్కడ నుంచి వచ్చిందో’ అని ఆశ్యర్యం వ్యక్తం చేసింది. కాగా, కొద్ది రోజుల క్రితం థాయ్‌లాండ్‌లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ మహిళ టాయిలెట్‌లో కుర్చుంటే.. కొండ చిలువ ఆమె కాలును కరిచింది. ప్రాణభయంతో ఆమె వెంటనే దాన్ని తన రెండు చేతులతో పట్టుకుంది. అయితే, అది తన తోకతో ఆమె చేతిని బలంగా పట్టుకుంది. టాయిలెట్ నుంచి కేకలు విన్న ఆమె పిల్లలు.. తల్లిని ఆ పరిస్థితుల్లో చూసి వెంటనే సుత్తీ, రంపం తీసుకొచ్చారు. వాటితో కొండ చిలువను ముక్కలుగా కోసేశారు. దాన్ని కోసే క్రమంలో ఆమె కూడా గాయపడింది.