పూల ఉత్సవం.. నాలుగోరోజు నానేబియ్యం బతుకమ్మ  - MicTv.in - Telugu News
mictv telugu

పూల ఉత్సవం.. నాలుగోరోజు నానేబియ్యం బతుకమ్మ 

October 19, 2020

ఈసారి బతుకమ్మ సంబరాలకు కరోనా వైరస్ ఓవైపు, భారీ వర్షాలు మరోవైపు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. కరోనా కారణంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆడపడుచులు బతుకమ్మలు పేర్చుతున్నారు. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బతుకమ్మలు పేర్చలేకపోతున్నారు. గ్రామాల్లో వానలు కురువని చోట్ల బొడ్డెమ్మలు పేర్చుతున్నారు. కానీ, హైదరాబాద్‌లో మాత్రం ఆ శోభ కళ తప్పింది. వానలు గుబులు రేపుతుండటంతో మహిళలు బతుకమ్మల వైపు వెళ్లడం లేదు. తొమ్మిది రోజుల సంబరంలో భాగంగా మూడు రోజులు ముచ్చటగా గడిచిపోయాయి. ఈరోజు నాలుగవ రోజు. నిన్న ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. నేడు ‘నానే బియ్యం బతుకమ్మ’ ఉత్సవం. ఇవాళ కూడా అన్నలు, అక్కలు సైకిళ్ళ మీద శివారు మీదకు వెళ్లి పువ్వులను కోసుకురావడానికి వెళ్తారు. 

ఈరోజు బతుకమ్మ ప్రసాదంలో ఏముంటుందంటే..  నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి గౌరమ్మకు నైవేద్యంగా పెడతారు. రాక్షస సంహారం కోసం తొమ్మిది రోజుల పాటు పోరాడిన జగన్మాత ఆకలితో అలసిపోయి ఉంటుందని నాలుగో రోజు నానిన బియ్యంతో చేసిన నైవేద్యాలు సమర్పిస్తారు. బియ్యాన్ని కడిగి, నానబెట్టి, ఆ తర్వాత ఆరబెడతారు. దానిని మెత్తగా పిండిలా చేస్తారు. అందులో పాలు, చక్కెర, నెయ్యి వేసి పాలకాయల వలె చిన్న ఉండలుగా చేస్తారు. వీటిని పచ్చిపిండి ముద్దలు అని కూడా పిలుస్తారు. కొత్తగా వడ్లు వచ్చే కాలం కాబట్టి బియ్యానికి కొదువ ఉండదు. పైగా అమ్మవారికి బియ్యం అంటే ఎంతో ప్రీతి. అందుకే నానిన బియ్యంతో చేసిన పదార్థాలు ఇవాళ నైవేద్యంగా సమర్పిస్తారు. సాయంత్రం అందరూ బతుకమ్మలను ఒకచోట చేర్చి ఆడిపాడి నిమజ్జనం చేసి, బలవర్దకమైన ప్రసాదం ఆరగించడంతో నానేబియ్యం బతుకమ్మ ఉత్సవాలు ముగుస్తాయి.