Flowers to Cost a Bomb this Festive Season in telugu states
mictv telugu

పండుగల సీజన్‌.. అమాంతం పెరిగిన పూల ధరలు.. కిలో రూ.1800

August 29, 2022

ఈ నెల (ఆగస్ట్) 21 తో పెళ్లి ముహూర్తాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతో పురోహితులతో పాటు వంట మేస్త్రీ, పూల అలంకరణ చేసేవాళ్లు, క్యాటరింగ్‌ సిబ్బంది, లైటింగ్‌ డెకరేషన్‌ వారికి పెద్దగా పని ఉండదని.. మిగతా వస్తువులకు ఏమంత గిరాకీ ఉండదని అందరూ అనుకున్నారు. కానీ వచ్చే రోజులన్నీ పండుగ రోజులే. వినాయక చవితి, బతుకమ్మ, విజయ దశమి, దీపావళి.. ఇలా నెల రోజుల్లో సగం రోజులన్నీ పండుగ దినాలే. ఇలాంటి సమయంలో.. పువ్వుల ధరలు అమాంతం పెరిగిపోయాయి.

పండుగల సీజన్ దగ్గర పడటంతో మార్కెట్ లో పువ్వుల ధరలు మండిపోతున్నాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతం కంటే రెండు రేట్లు అధికంగా వ్యాపారాలు పువ్వులు అమ్ముతున్నారని చెబుతున్నారు. కేజీ మల్లెలు, సన్నజాజి పువ్వులు రూ. 400గా పలుకుతుండగా… చామంతి పువ్వులు కేజీ 250 రూపాయల పైమాటే అంటున్నారు. ఇక, కనకాంబరం కేజీ రూ.1800గా అమ్ముతున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో 50 రూపాయలు వుండే ఏ పువ్వులైన ఇప్పుడు 100 రూపాయలకు పైగానే అమ్మేస్తున్నారు వ్యాపారులు.

కాగా, ఈ నెల 31వ తేదీన వినాయక చవితి ఉంది.. తొమ్మిది రోజుల పాటు గణపయ్యను పూజించడానికి.. ప్రతీవిధుల్లో వినాయక మండపాలను ముస్తాబు చేయడానికి పువ్వులు, పత్రికి భారీగా డిమాండ్‌ ఉంటుంది.. ఈ నేపథ్యంలో ఆ డిమాండ్‌ను క్యాష్‌ చేసుకోవడానికి వ్యాపారులే.. పువ్వుల ధరలను పెంచేశారని మండిపడుతున్నారు భక్తులు.