స్పీకర్‌కు ప్లైయింగ్ కిస్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే - MicTv.in - Telugu News
mictv telugu

స్పీకర్‌కు ప్లైయింగ్ కిస్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

November 20, 2019

అసెంబ్లీ సమావేశాలు అంటే అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధంతో వాడీ వేడిగా సాగుతుంటాయి. కానీ ఒడిశా అసెంబ్లీ సమావేశాలు మాత్రం నవ్వులు పూయించింది. మంగళవారం సభలో మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే స్పీకర్‌కు ప్లైయింగ్ కిస్ ఇచ్చి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. 

ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహినీపతి తన నియోజకవర్గంలోని సమస్యలను ప్రస్తావించేందుకు స్పీకర్‌ను అవకాశం ఇవ్వాలని కోరారు. స్పీకర్ నుంచి అనుమతి రావడంతో తాగునీటి సమస్య సహా పలు అంశాలను సభ దృష్టికి తీసుకుచ్చారు. ప్రసంగం చివర్లో స్పీకర్ ఎస్.ఎన్ పాట్రో‌కు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి ముగించారు. దీంతో శాసన సభ్యులంతా ఒక్కసారిగా నవ్వారు. 

అయితే స్పీకర్‌కు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడంపై ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. 147 మంది సభ్యుల్లో ముందుగా తనకే అవకాశం ఇవ్వడంతోనే అలా చేశానని చెప్పారు. స్పీకర్ పై ఉన్న గౌరవాన్ని అలా వెల్లడించానన్నారు. మరో ఉద్దేశం ఏమీ తనకు లేదని తన నియోజకవర్గ సమస్యలను సావదానంగా విన్నారని పేర్కొన్నారు.