నగరంలోని బీహెచ్ఈఎల్ జంక్షన్ వద్ద నిర్మాణం జరుగనున్న ఫ్లైఓవర్‌కు కేంద్రం నిధులు మంజూరు చేసింది. రూ. 130.65 కోట్ల నిధులు అందజేస్తున్నట్టు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ ప్రాజెక్టును ఈ ఏప్రిల్ 29న శంషాబాద్ వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మించాలని వాహనదారులు, స్థానికులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. నగరం నుంచి జహీరాబాద్, నాగ్‌పూర్, పుణె వంటి తదితర నగరాలకు ఈ రహదారి గుండా ప్రయాణించాల్సి ఉంది. అలాగే పారిశ్రామిక వాడ కూడా ఉండడంతో వేలాది వాహనాలు బారులు తీరుతాయి. ఈ క్రమంలో బీహెచ్ఈఎల్ జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుపుకుంటే ఆ ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. పుణె – హైదరాబాద్ జాతీయ రహదారి మీద నిర్మించే ఈ ఫ్లైఓవర్ 1.65 కిలోమీటర్లు ఉండనుంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నితిన్ గడ్కరీకి తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.