హరీశ్‌కు పచ్చపచ్చని కానుక.. ఊరంతా చెట్లు నాటి.. - MicTv.in - Telugu News
mictv telugu

హరీశ్‌కు పచ్చపచ్చని కానుక.. ఊరంతా చెట్లు నాటి..

June 3, 2020

FM

తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేట జిల్లాలో ఆయన దత్తత తీసుకున్న ఇబ్రహీంపూర్ గ్రామ ప్రజలందరూ మొక్కలు నాటారు. తన అభిమాన నాయకునికి పచ్చపచ్చని శుభాకాంక్షలు చెప్పారు. ఆయన పుట్టిన రోజున ఊరంతా మొక్కలు నాటి స్పూర్తిగా నిలిచారు. ‘హరీశ్ రావు అంటే మాకు అభిమానం. ఆయన మా బిడ్డ. ఆయన మా అన్న.. ఆయన మలో ఒకరు. మా ఊరిని దత్తత తీసుకున్న మా కుటుంబ సభ్యుడాయన. ప్రతి ఒక్కరు తమ పుట్టిన రోజున ఒక మొక్క నాటాలి అని స్ఫూర్తి నింపిన హరీశ్ రావు గారి  పుట్టిన రోజున మా ఇంట్లో మొక్క నాటి మేము స్ఫూర్తిగా నిలుస్తాం. ఆయన ఆలోచనను ఆచరణలో చూపెడతాం. మంత్రి దత్తత గ్రామం స్ఫూర్తిని చాటుతాం’ అని ఆ గ్రామస్తులు కుటుంబ సమేతంగా మొక్కలు నాటారు.  గ్రామంలో 300 ఇళ్లు ఉంటే 300 ఇండ్లలో ఇంటికో జామ, ఇతర పండ్ల  మొక్క నాటారు. మా హరీశ్ అన్నకు ఇచ్చే ఉడుత భక్తిగా ఒక మొక్క బహుమనం అని సంతోష పడుతున్నాం అన్నారు.

ఈ కార్యక్రమంలో  సర్పంచ్ కోడూరి దేవయ్య, ఉప సర్పంచ్ వంక దేవయ్య, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, అన్నీ కుల సంఘాల పెద్దలు, గ్రామస్తులు అందరూ కలసి పాల్గొన్నారు. కాగా, మంత్రి హరీశ్ రావు ఎప్పుడూ ఓ మాట అంటుంటారు. ‘సిద్దిపేట నా కుటుంబం.. మీలో ఒక కుటుంబ సభ్యున్ని నేను. నేను ఎక్కడ ఉన్నా నా మనసు మాత్రం సిద్దిపేట ప్రజలపైనే ఉంటుంది. పక్షి ఎక్కడ ఉన్నా రాత్రికి గూటికి చేరుకుంటుంది.. నేను ఎక్కడ ఉన్నా రాత్రికి మాత్రం సిద్దిపేట ప్రజల గూటికే చేరుకుంటా’ అని అంటుంటారు. అలాంటి తమ ప్రియతమ నాయకుడికి ఇబ్రహీంపూర్ వాసులు పచ్చని మొక్కతో ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం విశేషం.