హైదరాబాద్‌ను పొగమంచు కమ్మేసింది. నగరంలో పలు చోట్లు తేలిక పాటి వర్షం కురుస్తోంది. ఈ ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 8 గంటలు కావొస్తున్నా వెలుతురు కనిపించడం లేదు. దీంతో వాహనదారులకు రోడ్డు కనిపించపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లడ్ లైట్లు వేసినా రహదారి కనిపించలేనంతగా మంచు పడుతోంది. పొగమంచు ధాటికి మార్నింగ్ వాకర్స్, ఎక్సర్ సైజ్ చేసేవాళ్లు కనిపించడం లేదు. దీంతో స్టేడియాలు, పార్కులు, రోడ్లు అన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి.
పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గురువారం అర్ధరాత్రి నుంచే ఈ వర్షం మొదలైందని సమాచారం. నగరంలోని అమీర్ పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ , చింతల్, ఆర్టీసీ క్రాస్ రోడ్, బేగంపేట్, తార్నాక , బాలా నగర్, సికింద్రాబాద్ , హాబ్సిగూడ ప్రాంతాల్లో వాన పడుతోంది. రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి.
మరో వారం పదిరోజుల్లో చలికాలం ముగియనుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో జనాలు బయటకి కూడా రావట్లేదు. దీనికితోడు చల్లని గాలులు వీస్తున్నాయి. ప్రజలు మళ్లీ స్వెటర్లు, చలి మంటలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక వృద్ధులు, చిన్న పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలికి వణికిపోతున్న వారు బయటకు రాకుండా ఇంటికి పరిమితమయ్యారు.