మూడ్….ఇది లేనిదే జీవితం లేదు. ఏ పని చేయాల్నా మూడ్ ఉండాలి. చివరకి తినాలన్నా, పడుకోవాలన్నా కూడా మూడ్ ఉండాలి. మన బుర్ర ప్రశాంతంగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో ప్రతీ మనిషి ఒత్తిడిలో ఉంటున్నాడు. జీవనశైలి, ఆఫీస్ టెన్షన్స్, ఫైనాన్షియల్ మేటర్స్, ఇంట్లో సమస్యలు ఇలా చాలా రకాలుగా చికాకు కు గురవుతున్నాడు. దాంతో ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే ఒత్తిడి ఉంటే ఏ పనీ చేయలేరు. మూడ్ బావుండదు. ప్రతీ చిన్న విషయానికి కోపం వస్తూ ఉంటుంది. ఇది నెమ్మదిగా శారీరక సమస్యలకూ దారి తీస్తుంది. మరి ఇందులో నుంచి బయటపడడం ఎలా? ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే ఏం చేయాలి. రోజంతా మూడ్ బావుండాలి అంటే ఎలా ఉండాలి?
రోజంతా మూడ్ బావుండాలి అంటే మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిందే. అది మనకు కష్టమైనా తప్పదు. అలా చేస్తే మొత్తం లైఫ్ బావుంటుంది.
ఉదయాన్నే లేవాలి:
కొంచెం తొందరగా లేవడం అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే అంటే ఏ తెల్లవారు ఘామునో లేచిపోనక్కర్లేదు. జస్ట్ ఇప్పుడు లేస్తున్న దానికంటే ఒక 15 నిమిషాలు ముందు లేస్తే చాలు. ఇలా ముందు లేవడం వలన రోజంతా ప్లాన్ చేసుకోవచ్చును. దానివలన అన్ని సనులను సకాలంలో పూర్తి చేసుకోవచ్చును. ప్లానింగ్ ఉంటుంది కాబట్టి చికాకు కూడా ఉండదు. రోజులో ఏం చేయాలో స్పష్టమైన ఆలోచన ఉంటుంది.
నవ్వు:
నవ్వు…ఎంతటి ఒత్తిడిని అయినా తొలగిస్తుంది. ఉదయాన్నే లేవగానే చిన్న నవ్వు నవ్వండి. ఒత్తిడితో, విశ్రాంతి లేకుండా నిద్ర లేవొద్దు. దీనివల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది.
కృతజ్ఞత:
ఎదుటి వ్యక్తుల మీద కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. నవ్వుతూ పలకరించాలి. ఇది ఎదుటి వ్యక్తి మీద మంచి అభిప్రాయాన్ని కలుగజేస్తుంది. జీవితంలో ప్రతీదానికీ కృతజ్ఞత ఉండాలి.
సానుకూల దృక్పథం:
ప్రపంచంలో ఏ వ్యక్తీ పరిపూర్ణుడు కాదు. ఏ విషయాన్నైనా సానుకూల దృక్పథంతో చూడటాన్ని అలవరుచుకోవాలి. మన గురించి మనం బాగా ఆలోచించుకోవాలి. ఎదుటి వ్యక్తి ఏదైనా చెబుతుంటే పూర్తిగా వినాలి. తెలిసిన విషయమైనా, చిన్నవారు చెబుతున్నా వినాలి. అన్నీ నాకే తెలుసు అన్న ఆలోచన కాసేపు దూరం పెట్టాలి.
వాకింగ్:
ఒత్తిడి అనిపించినప్పుడు కాసేపు నడవాలి. దానివల్ల చాలా రిలాక్స్ అవుతారు. ఆందోళన తొలగిపోతోంది.
సంగీతం వినండి:
మానసికస్థితి బాగుండాలంటే, సంతోషంగా ఉండాలంటే సంగీతాన్ని వినాలి. మ్యూజిక్ మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. ఏ పాటలు నచ్చితే అవే వినాలి.
యోగా:
మనకోస మనం రోజులో కనీసం ఒక ఐదు నిమిషాలు అయినా కేటాయించాలి. ధ్యానం, యోగా చేయాలి. దీనివల్ల మనసు క్లియర్ అవుతుంది. ప్రతికూల ఆలోచనలను వదిలేయాలి.
నిద్ర:
మంచి ఆరోగ్యం కావాలంటే మంచి నిద్ర ఉండాలి. రోజుకు కనీసం 8 గంటలు కచ్చితంగా నిద్రపోవాలి. దీనివల్ల మానసిక స్థితి బాగుపడుతుంది. మరుసటి రోజు మరింత ఉత్సాహంగా ఉంటారు.