follow-these-tips-for-cleaning-bad-cholesterol
mictv telugu

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోండిలా…

March 18, 2023

 follow-these-tips-for-cleaning-bad-cholesterol

శరీరంలో కొలెస్ట్రాల్ అందరికీ ఉంటుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది మళ్ళీ. మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అని. మంచిది శరీరం శక్తివంతంగా ఉండడానికి సహాయం చేస్తే…చెడుది మాత్రం అనారోగ్యాలకు కారణం అవుతుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయి గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగితే.. గుండెపోటు, స్ట్రోక్, గుండె సమస్యలు, హైపర్‌టెన్షన్, డయాబెటిస్‌ వచ్చే ముప్పు పెరుగుతుంది.

చెడు ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి, శారీర శ్రమ లేకపోవడం, కొన్ని ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ చరిత్ర కారణంగా.. కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. NCBI నివేదిక ప్రకారం, భారతదేశం నగరాల్లో 25-30% మంది, గ్రామాల్లో 15-20% మంది ప్రజలు అధిక కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ప్రశాంతంగా నిద్రపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడి తగ్గించుకుంటే.. కొలెస్ట్రాల్‌ సమస్య దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాలను తగ్గించడానికి మనింట్లో వస్తువులే ఎంతో సహాయపడతాయని అంటున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా.

పసుపు:
పసుపు ధమనుల గోడలపై పేరుకునే ఫలకాన్ని తగ్గించి, సిరల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను విచ్ఛిన్నం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్‌ సీరం LDL, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గింస్తుందని అధ్యయనాలు స్పష్టం చేశాయి. చిటికెడు పసుపు గోరువెచ్చని నీటిలో కలిపి రోజూ తీసుకుంటే.. కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి.

మెంతులు:
మెంతులలో పొటాషియం, ఐరన్, జింక్, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తాయి. వీటిల్లోని సోపోనిన్సు రక్తంలో కొలెస్ట్రాల్‌ తగ్గటానికీ సహాయపడతాయి. మెంతులలో జీరో క్యాలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతులు తీసుకుంటే మేలు జరుగుతుంది. ఒక టీస్పూన్ మెంతి పొడిని రోజుకు రెండుసార్లు గోరువెచ్చని నీటితో వేసి తీసుకుంటే మంచిది.

ధనియాలు:
ధనియాలలో హైపోగ్లైసీమిక్ గుణాలు ఉంటాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ధనియాల్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ ఎ, బీటా కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని కాపర్, జింక్‌, ఐరన్‌ వంటి మినరల్స్‌ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఒక స్పూన్‌ ధనియాలు.. నీటిలో వేసి రెండు నిమిషాలు పాటు మరిగించి.. వడగట్టాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని రోజూ తాగితే.. కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.

తేనె:
తేనె రక్త నాళాల లైనింగ్‌లోకి చెడు కొలెస్ట్రాల్‌ చేరకుండా నిరోధిస్తుంది. తేనె ఎల్‌డిఎల్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను 6%, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను 11% తగ్గించి, హెచ్‌డిఎల్ మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. తేనెలో అస్సలు కొవ్వు ఉండదు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్‌ ఆప్షన్‌. అధిక కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడేవారు రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్‌ తెనె, నిమ్మరసం, కొన్ని చుక్కల యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ వేసుకుని తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

వెల్లుల్లి:
పచ్చి వెల్లుల్లి.. గుండె సంబంధ వ్యాధుల నుంచి రక్షించడానికి మెరుగ్గా పనిచేస్తుంది. ప్రతి రోజూ సగం వెల్లుల్లి రెబ్బను తీంటే.. కొలెస్ట్రాల్ స్థాయి 10% తగ్గుతుందని నివేదికలు చెబుతున్నాయి. వెల్లుల్లిలో సల్ఫర్ ఉంటుంది. ఇది రక్తనాళాలలో పేరుకున్న కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. 6-8 వెల్లుల్లి రెబ్బలను గ్రైండ్ చేసి 50 మి.లీ పాలు, 200 మి.లీ నీటిలో వేసి మరిగించి తాగాలి. వెల్లుల్లిలో హ్యూమన్ 3, హైడ్రాక్సీ-3, మిథైల్‌గ్లుటరిల్-కోఎంజైమ్ A (HMG-CoA), స్క్వాలీన్ మోనో ఆక్సిజనేస్ వంటివి కొలెస్ట్రాల్‌ను నివారించడంలో సహాయపడతాయి.

ఆపిల్‌:
ఆపిల్ లో పెక్టిన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలోని ఫ్లేవనాయిడ్స్‌ యాంటీఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి. ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు రోజుకొక ఆపిల్‌ తినడం మంచిది.

బీట్‌రూట్‌:
బీట్‌రూట్‌లో కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు మెండుగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌లో ఉంచుతాయి. హైపర్‌టెన్షన్‌ తగ్గిస్తాయి. బీట్‌రూట్‌లో ఉన్న నైట్రేట్స్‌ రక్త ప్రసరణను సులభతరం చేయడమే కాకుండా మొత్తం బ్లడ్‌ ప్రెజర్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. దీంతో హైపర్‌టెన్షన్‌ నియంత్రణలో ఉంటుంది.