దేశవ్యాప్తంగా ‘కేజీఎఫ్-2’ సినిమా ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో విడుదలై, రికార్డులు బ్రేక్ చేసి, కలెక్షన్ల పరంగా టాప్ ప్లేసులో నిలిచింది. ‘కేజీఎఫ్-2’ సినిమాను చూసి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు చెందిన ఓ 15 ఏండ్ల బాలుడు హీరో యష్ (రాఖీభాయ్) పాత్రకు ఆకర్షితుడై, రాఖీభాయ్లాగే స్టైలుగా సిగరెట్లు తాగాలని ఓకేసారి ప్యాకెట్ సిగరెట్లు కాల్చి, తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన సంఘటన శనివారం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ప్రాంతంలో నివాసం ఉండే ఓ 15 ఏండ్ల కుర్రాడు ఇటీవలే విడుదలైన ‘కేజీఎఫ్-2’ సినిమాను రెండు రోజుల వ్యవధిలో మూడుసార్లు చూశాడు. ఆ తర్వాత హీరో రాఖీభాయ్ పాత్రకు బాగా ఆకర్షితుడై, ఫోజులు కొడుతూ ఒకేసారి ప్యాకెట్ సిగరెట్లు కాల్చాడు. దాంతో ఆ కుర్రాడికి దగ్గు, గొంతు నొప్పి, కండ్ల నుంచి కన్నీరు విపరీతంగా వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. గమనించిన ఆ బాలుడి తల్లిదండ్రులు ఏం జరిగిందని గట్టిగా నిలదీయండంతో అసలు విషయం చెప్పాడు. అప్రమత్తమైన తల్లిదండ్రులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. సకాలంలో బాలుడికి వైద్యం అందించిన డాక్టర్లు.. అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.