ప్లాస్టిక్ చెత్త ఇచ్చి ఎంతైనా తినొచ్చు.. గుజరాత్‌లో ప్రయోగం
పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువులపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే జులై 1 నుంచి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ని నిషేధించింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని జునాఘఢ్ పట్టణ అధికారులు నగరాన్ని శుభ్రంగా ఉంచడానికి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా తమ ఇంట్లో కానీ, వీధిలో కానీ కనిపించిన ప్లాస్టిక్ చెత్తను తీసుకొచ్చి అప్పగిస్తే వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేఫ్‌లో ఉచితంగా తిండి, జ్యూస్ వంటివి ఇస్తామని ప్రకటించారు. ఈ కేఫ్‌లోని ఆహార పదార్ధాలు సహజసిద్ధంగా ఉన్న ఎరువులు వేసి పండించినవే కావడం గమనార్హం. సర్వోదయ సాక్షి మండల్ నిర్వహించే ఈ కేఫ్‌లో అరకిలో ప్లాస్టిక్ చెత్తను తీసుకెళ్తే ఓ గ్లాసు నిమ్మరసం ఇస్తారు. కిలో చెత్తకు పోహ అనే స్థానిక ఆహార పదార్ధం ఇస్తారు. ఈ నెల 30 నుంచి ప్రారంభమయ్యే ఈ కేఫ్‌లో సేకరించే చెత్తను కొనుగోలు చేసేందుకు ఒక ఏజెన్సీని కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఈ చర్యల వల్ల నగరం శుభ్రంగా ఉండడంతో పాటు ప్రజలకు పర్యావరణం పట్ల అవగాహన ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడిస్తున్నారు.