పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే మాటను నిజం చేసింది ఓ యువతి. సెలవులకు ఇంటికొచ్చిన ప్రతిసారి తల్లిదండ్రుల కష్టంలో పాలుపంచుకునేది. పూలు అమ్మే కుటుంబంలో పుట్టిన, తాను అనుకున్నది సాధించాలని తపనతో కష్టపడి చదివింది. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించింది.
ముంబై వీధుల్లో పూల దండలు అమ్మడంలో తండ్రికి తోడుగా ఉండే 28 ఏళ్ల సరిత.. ప్రస్తుతం జేఎన్‌యూలోని భారతీయ భాషా కేంద్రంలో హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేస్తోంది. జేఎన్‌యూ నుంచి ఎం.ఏ, ఎం.ఫిల్ పట్టభద్రురాలైన ఆమె అక్కడే పీహెచ్డీలోను సీటు సాధించింది. వినాయక చవితి, దీపావళి, దసరా వంటి పండుగల సమయంలో తండ్రితో కలిసి సరిత కూడా పూలు అమ్మేది.
గత రెండేళ్లుగా మహమ్మారి దెబ్బతో ఆమె తండ్రి వ్యాపారం ఆగిపోయింది. దాంతో కష్టాలు మొదలయ్యాయి. చిన్నప్పటి నుంచి కుటుంబ ఇబ్బందులను చూస్తూ పెరిగిన ఆమెకు జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల ఎక్కువైంది. 2010లో జేఎన్‌యూ గురించి తన బంధువు ద్వారా తెలుసుకుంది. జేఎన్‌యూలో చదవడమే లక్ష్యంగా కలలు కంది. బీఏ పూర్తయిన తరువాత 2014లో మాస్టర్స్ కోసం ఓబీసీ కేడర్‌లో చివరి సీటుకు ఎంపికైంది. అదే తన జీవితంలో టర్నింగ్ పాయింట్‌గా భావించి, ఎం. ఏ, ఎం. ఫీల్, పీహెచ్‌డి చేస్తూనే, అమెరికాలో సీటు సంపాదించి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు.