మేం వచ్చాకే రోడ్లపై నమాజ్ ఆగింది.. సీఎం యోగి - MicTv.in - Telugu News
mictv telugu

మేం వచ్చాకే రోడ్లపై నమాజ్ ఆగింది.. సీఎం యోగి

May 23, 2022

యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లపై నమాజ్ చేయ‌డం ఆగిపోయిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.గత ఐదేళ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుప‌డ్డాయని, తాను ముఖ్యమంత్రి అయిన‌ప్ప‌టి నుంచి ( 2017 నుంచి ) రాష్ట్రంలో ఎక్కడా అల్లర్లు చోటుచేసుకోలేదని చెప్పారు. ఈద్ సందర్భంగా వీధుల్లో ప్రార్థనలు చేయడం ఆగిపోయిందని, అలాగే మతపరమైన ప్రదేశాల నుండి లౌడ్ స్పీకర్లను కూడా తొలగించినట్టు చెప్పారు.

రాష్ట్రంలో శ్రీ రామ నవమి సందర్భంగా మత ఘర్షణలు జరగలేదని, ఈసారి రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. అలాగే, గోవుల కోసం గోశాలను నిర్మించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని అక్రమ కబేళాలను బీజేపీ ప్రభుత్వం మూసివేసిందని, రాష్ట్రంలో గోవులను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు గోశాలలను నిర్మించామని చెప్పారు. గతంలో ముజఫర్‌నగర్‌, మీరట్‌, మొరాదాబాద్‌ తదితర ప్రాంతాల్లో అల్లర్లు జరిగేవని.. నెలల తరబడి కర్ఫ్యూలు ఉండేవని.. అయితే తన పాలనలో మాత్రం అల్లర్లు జరగలేదన్నారు.