తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలకు ఆప్లై చేసే అభ్యర్థులకు టీఎస్ఎస్పీడీసీఎల్ ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. జేఎల్ఎం పోస్టులకు 10 ఏళ్ల గరిష్ట వయోపరిమితిలో సడలింపు లేదని ప్రకటన విడుదల చేసింది. విద్యుత్ స్తంభాలను ఎక్కి విధులు నిర్వహించే జూనియర్ లైన్మెన్కు శారీరక దారుఢ్యం అత్యంత కీలకమని, ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి సడలింపు ఇవ్వరాదని టీఎస్ఎస్పీడీసీఎల్ నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు.
”1,000 జేఎల్ఎం, 201 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 70 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి సంస్థ ఈనెల 9న సంక్షిప్త ప్రకటన జారీ చేసింది. అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్ పోస్టులకు మాత్రమే 10 ఏళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు ఉంటుంది. జేఎల్ఎం, సబ్ ఇంజనీర్ పోస్టులు జిల్లా స్థాయి పోస్టులే. కొత్త జోనల్ ప్రకారమే ఈ పోస్టులను భర్తీ చేయనున్నాం. 95 శాతం పోస్టులు ఆయా జిల్లాల అభ్యర్థులకే దక్కనున్నాయి” అని అధికారులు తెలిపారు.
ఈ జేఎల్ఎం పోస్టులకు..ఐటీఐ (ఎలక్ట్రికల్)తోపాటు అప్రెంటిస్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన వారు కూడా సబ్ ఇంజనీర్ పోస్టులకు అర్హులు కానున్నారని అధికారులు నోటిఫికేషన్లో పేర్కొన్నట్లు తెలిపారు. జేఎల్ఎం, సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి గురువారం పూర్తి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.