నీ సుఖమే నే కోరుతున్నా.. భార్య ప్రేమకై భర్త విడాకులు.. - MicTv.in - Telugu News
mictv telugu

నీ సుఖమే నే కోరుతున్నా.. భార్య ప్రేమకై భర్త విడాకులు..

November 26, 2019

For wife's happiness, Bhopal

తన భార్య ఇతరులను ప్రేమించడం ఏ భర్తా సహించడు. ఒకవేళ పెళ్లికి ముందు తన భార్య వేరే వ్యక్తిని ప్రేమించినా భర్త అస్సలు ఒప్పుకోడు. అది పురుష లక్షణం. కానీ ఓ భర్త తన భార్య వేరే వ్యక్తిని పెళ్లికి ముందు ప్రేమించింది. పెళ్లయ్యాక అతన్ని మరిచిపోలేకపోతోంది. అది గమనిస్తే ఏ పురుషుడైనా ఆమె మీద చేయి చేసుకుంటాడు. కానీ, అతను ఆ పని చేయలేదు. ఆమె మనసుకు నచ్చినట్టు ఆమె ఉండాలని కోరుకున్నాడు. ‘నీ సుఖమే నే కోరుతున్నా’ అని ఆమె సఖుడితో వెళ్లిపోవడానికి తాను అడ్డుగా ఉండొద్దని భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఇదంతా సినిమా కథలా ఉంది కదూ. ‘కన్యాదానం’ సినిమాలో హీరో శ్రీకాంత్ హీరోయన్ రచనను ఇలాగే ఆమె ప్రియుడి వద్దకు పంపిస్తాడు. అది సినిమా అయితే ఇది జీవితం, అంతే తేడా. 

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. భోపాల్‌కు చెందిన మహేశ్‌, సంగీతకు ఏడేళ్ల క్రితం వివాహం అయింది. మహేశ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కాగా, సంగీత ఫ్యాషన్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇదిలాఉండగా సంగీత పెళ్లి కన్నా ముందే ఓ వ్యక్తిని ప్రేమించింది. కానీ, వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. అప్పుడు మహేశ్ సంబంధం చూసి పెళ్లి చేశారు. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది. కానీ, ఆమె మనసంతా ప్రియుడిపైనే ఉండేది. అతని ధ్యాసతోనే ఉండేది. నిద్రలో కలవరింతలు చేసేది. ఈ విషయమై ఇద్దరు భార్యాభర్తల నడుమ తరచూ గొడవలు జరుగుతుండేవి. 

తర్వాత మహేశ్ ఈ విషయం గురించి బాగా ఆలోచించాడు. ఈ గొడవలకు ఇంతటితో ఫుల్‌స్టాప్ పెట్టాలనుకున్నాడు. ఆమెకు నచ్చినట్టు ఆమె ఉండాలని భావించాడు. అందుకు తాను అడ్డుగా ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. ఆమె తన ప్రియుడి వద్దకు వెళ్లాలంటే చట్టపరంగా ఆమెకు తాను విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఫ్యామిలీ కోర్టులో మహేశ్ విడాకుల కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. మహేశ్‌తో విడాకులు తీసుకునేందుకు కూడా సంగీత ఒప్పుకుంది. ఇద్దరు పిల్లల సంరక్షణ తానే చూసుకుంటానని మహేశ్‌ చెప్పాడు. ఇందుకు కూడా సంగీత అంగీకరించింది. పిల్లలను ఎప్పుడు చూడాలనిపించినా ఎప్పుడైనా ఇంటికి రావొచ్చని మహేశ్ పెద్ద మనసుతో సంగీతకు చెప్పాడు. భర్త మంచి మనసుకు సంగీత పొంగిపోయింది. త్వరలోనే భార్యకు విడాకులు ఇచ్చి ఆమెకు నచ్చిన జీవితాన్ని  ఇవ్వనున్నాడు మహేశ్.