ఐదేళ్ల బాలుడు ఓ రాత్రంతా అడవిలో గడిపాడు. వన్యమృగాలు, విషసర్పాలు, చిన్న, పెద్ద జంతువులుండే ఆ అడవిలో ఒక్కడే ఆ చీకట్లో బిక్కుబిక్కుమంటూ గడిపాడు. మంగళవారం తండ్రితో కలసి పశువులను మేపేందుకు అడవికి వెళ్లిన ఆ బాలుడు.. సాయంత్రం వేళ అకస్మాత్తుగా తప్పిపోయాడు. పశువులను మేపే క్రమంలో తండ్రి నుంచి దూరమై ఎటో వెళ్లిపోయాడు. ఆందోళన గురైన తండ్రి సహ ఇతర కుటుంబసభ్యులు, గ్రామస్తులు బాలుడి ఆచూకీ కోసం అడవి అంతా గాలించారు. గ్రామస్తులు, అటవీ సిబ్బందితో కలిసి వెతికినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో, అంతా తిరుగుప్రయాణం అయ్యారు. పులులు, క్రూరమృగాలు తిరిగే ఆ అడవిలో బాలుడు బతికి బయటపడగలడా అంటూ గ్రామస్తులు ఓ సమయంలో పలు సందేహాలు వ్యక్తం చేశారు కూడా. కడప జిల్లాలో పోరుమామిళ్ల అడవిలో సుమన్ అనే బాలుడు అదృశ్యమయ్యాడు.
బాలుడు స్వస్థలం టేకూరుపేట బీట్ పరిధిలోని బుచ్చంపల్లి గ్రామం. నిన్న సాయంత్రం కవలకుంట్ల రిజర్వు అడవిలో తండ్రి వెంట బాలుడు కూడా పశువుల కాసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో దారి తెలియక అడవిలో తప్పిపోయాడు. కుటుంబ సభ్యులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా… రాత్రి నుండి గాలింపు చర్యలు చేపట్టారు. అయినా బాలుడి ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 7గంటల సమయంలో సుమారు 10 కిలోమీటర్ల మేర అడవి లోపల ఉన్న బాలుడిని అటవీ సిబ్బంది కాపాడారు. బాలుడు చలికి సుమన్ వణికిపోతండడాన్ని గుర్తించి అతడిని తల్లిదండ్రులకు అప్పగించారు. అటవీశాఖ సిబ్బందికి బాలుడి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. రాత్రి మొత్తం అడవిలో ఒంటరిగా గడిపి ఉదయానికి సురక్షితంగా ఇంటికి చేరిన ఆ బాలుడు ధైర్యవంతుడని స్థానికులు చర్చించుకున్నారు.