క్యాసినో, మనీ ల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ కు చెందిన ఫాంహౌస్.. ఓ చిన్న జూ పార్క్ లా ఉందటున్నారు ఫారెస్ట్ అధికారులు. ఈడీ సోదాల తరువత దిమ్మతిరిగే వాస్తవాలు వెల్లడి అవుతున్న క్రమంలో చికోటి ఫాంహౌస్‌పై అధికారులు దృష్టి సారించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సాయిరెడ్డిగూడలో 12 ఎకరాల్లో ఉన్న చీకోటి ప్రవీణ్ ఫాంహౌస్‌లో శుక్రవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. . అక్కడ దేశ విదేశాలకు చెందిన రకరకాల జంతువులు పెంచుతున్నట్టు గుర్తించారు. రకరకాల పాములు, ఆఫ్రికాకు చెందిన ఇణుగులను పెంచడం నిబంధనలకు విరుద్ధమని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ హేమ తెలిపారు. కొన్ని రకాల పక్షులు, జంతువులను పెంచుకోవాలంటే అటవీ చట్టాల ప్రకారం ఆన్ లైన్ ధరఖాస్తు చేసుకుని అధికారుల పర్మిషన్ తీసుకోవాలని ఫారెస్ట్ అధికారి రమేష్ తెలిపారు.
అడవిలో స్వేచ్ఛగా తిరగాల్సిన జంతువులను ఇక్కడ బంధించారని.. ఫాంహౌస్ నిర్వాహకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఫాంహౌస్‌లో ఇగ్వానా, పలు రకాల పాములు, మేకలు, వివిధ జాతులకు చెందిన కుక్కలు, ఉడుములు, ముంగిస, సాలీళ్లు, బాతులు, ఆవులు, పావురాలు, బల్లులు ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు అక్కడ ఒక పురాతన రథం, జట్కాతో పాటు ఇత్తడితో తయారు చేసి రెండు సింహం విగ్రహాలు కనిపించాయి. అటవీశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్ లో ఉన్న జంతువులు, పక్షులను తరలిస్తామంటున్నారు. మరోవైపు ప్రవీణ్ ఇష్టంతోనే పక్షులను పెంచుకుంటున్నాడని ఆయన మామ, ఫాంహౌస్ నిర్వాహకుడు మాధవరావు తెలిపారు. ఫాంహౌస్ లో ఎటువంటి పార్టీలు జరగవని.. ఇక్కడున్న జంతువులు,పక్షులకు అన్ని అనుమతులు ఉన్నాయన్నారు. ఇక చీకోటి ప్రవీణ్ ఏజెంట్లు సంపత్, బబ్లు, రాకేశ్, వెంకటేశ్ ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు జరిపారు. జూబ్లిహిల్స్, సికింద్రాబాద్, బేగంబజార్ లో తనిఖీలు చేసిన ఈడీ ఆఫీసర్స్.. పలు కీలక డాక్యుమెంట్లు, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు.