బీజేపీలో చేరిన సింధియాపై ఫోర్జరీ కేసు క్లోజ్.. - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీలో చేరిన సింధియాపై ఫోర్జరీ కేసు క్లోజ్..

March 24, 2020

bgv

ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి తిలోదకాలిచ్చి కాషాయ తీర్థం పుచ్చకున్న జ్యోతిరాదిత్య సింధియాకు పెద్ద ఊరట లభించింది. పదేళ్లుగా ఆయనను వేధిస్తున్న ఫోర్జరీ కేసును మూసేశారు.  2009లో గ్వాలియర్‌లోని భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లతో అమ్మినట్టు సింధియాపై, ఆయన కుటుంబ సభ్యులపై అభియోగాలు నమోదు అయ్యాయి. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన మధ్యప్రదేశ్ ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) కేసును మూసివేసింది. ఈ విషయమై ఈవోడబ్ల్యూ అధికారులు మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 2009లో సింధియా, ఆయన కుటుంబ సభ్యులపై నమోదైన కేసు విషయంలో నిజనిర్ధారణ చేయాలని ఈవోడబ్ల్యూ నిర్ణయించింది. ఈ నెల 12న ఫిర్యాదుదారు సురేంద్ర శ్రీవాస్తవ మమ్మల్ని సంప్రదించారు. సింధియాపై నమోదైన కేసు విషయం మరోమారు పరిశీలించాలని కోరారు. ఆయన ఫిర్యాదును మేం గ్వాలియర్ కార్యాలయానికి పంపాం. వారు తిరిగి విచారణ జరిపి కేసును మూసివేశారు’ అని తెలిపారు. 

అయితే దీని వెనుక క్విడ్ ప్రో కో(నీకది నాకిది) వ్యవహారం ఉందని సింధియా వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. బీజేపీలో చేరినందుకు ప్రతిఫలంగా కేసును క్లోజ్ చేశారని విమర్శిస్తున్నారు. కేసు మూసివేసిన శుక్రవారం రోజే కమల్‌నాథ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం గమనార్హం. సోమవారం రాత్రి బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, ఈ నెల 10న సింధియా కాంగ్రెస్‌ను వీడి, బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.  ఆయన పార్టీని వీడిన తర్వాత ఆయన మద్దతుదారులైన 22 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడారు. దీంతో కమల్‌నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో సింధియా కీలకంగా మారారు.