Forgery case: Senior TDP leader Ayyanna patrudu arrested By Cid Police
mictv telugu

టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్.. కుమారుడిని కూడా..

November 3, 2022

ఏపీ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నర్సీపట్నంలో అర్థరాత్రి 2 గంటల సమయంలో అయ్యన్న నివాసానికి వెళ్లిన పోలీసులు.. ఆయనకే నోటీసులిచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగాలున్నాయి. ఈ కేసులో మొదటి నిందితుడిగా అయ్యన్నపాత్రుడు, రెండో నిందితుడిగా విజయ్, మూడో నిందితుడిగా రాజేష్ ఉన్నారు. క్రైం నంబర్ 64/2022 లో ఐపిసీ సెక్షన్లు 464,467, 471, 474, 120బి కింద అరెస్ట్ చేస్తున్నట్టు నోటీసులు ఇచ్చారు. గురువారం తెల్లవారు జామున గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు.. అయ్యన్నకు నోటీసులు అందజేసి అరెస్టు చేశారు. అయ్యన్న కుమారుడు చింతకాయల రాజేశ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు కోర్టులో వారిని ప్రవేశపెడుతామని చెప్పి తీసుకెళ్లారు పోలీసులు. కానీ ఆయన్ను విశాఖ ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి తరలించారు.

అయ్యన్నపాత్రుడి అరెస్టుపై మండిపడ్డారు ఆయన సతీమణి. అర్ధరాత్రి దౌర్జన్యంగా అరెస్టు చేయడమేంటని నిలదీస్తున్నారు. తాము ఎవరికేం అన్యాయం చేశామని ఇలా చేశారో అర్థంకావడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం దుస్తులు మార్చుకొనివ్వకుండా తన భర్తను తోసుకుంటూ తీసుకువెళ్లారని చెప్పారు. కాళ్లకు చెప్పులు కూడా వేసుకొనివ్వలేదని.. 3 ఏళ్లుగా తమ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె వాపోయారు. కొంతమంది పోలీసులు మద్యం సేవించి వచ్చారని.. అయ్యన్నకు ప్రాణ హాని ఉందని ఆరోపించారు. ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.