ప్రణయ్‌ను మర్చిపో.. అమృతకు బెదిరింపు లేఖ! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రణయ్‌ను మర్చిపో.. అమృతకు బెదిరింపు లేఖ!

September 24, 2019

ప్రేమికుల ఉసురు పోసుకున్నారు. అయినా వారి దాహం ఇంకా తీరలేదు. కుల అహంకారం కళ్లకు ఎక్కి మిర్యాలగూడలో ప్రణయ్‌ను అత్యంత కిరాతకంగా చంపేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రణయ్ హత్య ఎందరినో కలిచివేసింది. భర్తను కోల్పోయి అమృతవర్షిణి తీరని దుఖ్ఖాన్ని అనుభవిస్తోంది. మొన్నీ మధ్యే అమృత ప్రణయ్ బిడ్డకు తల్లి అయింది. ఆ బిడ్డలోనే తన ప్రణయ్‌ను చూసుకుని బతుకుతున్న అమృతపై వారి డేగ కన్ను ఇంకా ఎక్కువగా ఫోకస్ అయివుంది. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న అమృత తండ్రి మారుతీరావు మొన్న బెయిల్‌పై బయటకు వచ్చాడు. అప్పటినుంచి అమృత ఇంకా అభద్రతా భావానికి లోనైంది. ఆమె అనుకున్నట్టే జరుగుతోంది. అమృత మనసులోంచి ప్రణయ్‌ను పూర్తిగా తీసేయాలని భావిస్తున్నారు. ప్రణయ్‌ని మరిచిపోవాలంటూ బెదిరింపు కాల్స్‌తో పాటు బయటకు వచ్చి మరో పెళ్లి చేసుకోవాలంటూ ఇటీవలి కాలంలో అమృతకు వేధింపులు ఎక్కువయ్యాయి.

ఈ క్రమంలో తాజాగా జరిగిన ఘటన అందుకు అద్దం పడుతోంది. ఈ నెల 11న ప్రణయ్ వర్ధంతి రోజు ఓ ఆకతాయి అమృత ఇంటి తలుపుకు బెదిరింపుతో కూడిన లేఖను అంటించి వెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అతను హోండా షైన్ బైకుపై వచ్చాడు. అతని ముఖం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో వచ్చి ఇంటి తలుపులకు లెటర్ అంటించి వెళ్లిపోయాడు. 

ఇంటికొచ్చిన తర్వాత లేఖ చూసిన కుటుంబసభ్యులు ఖంగుతిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. లేఖలో సతీశ్ అనే వ్యక్తి ఫోటోతో పాటు కొన్ని వివరాలను దుండగుడు పొందుపరిచాడు. త్వరలోనే సదరు నిందితులను పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు.