ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. త్వరలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు మాజీ ఐఏఎస్ అధికారి వి.జి.ఆర్ నారగోని, బీసీ నాయకులు అన్నా రామచంద్ర యాదవ్ శుక్రవారం ప్రకటించారు. బహుజనుల హక్కుల కోసం తమ పార్టీ పని చేస్తుందని తెలిపారు. ఎక్కువ జనాభా ఉన్న బీసీల నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఏకం చేస్తామని వెల్లడించారు. అణగారిన వర్గాలకు రాజ్యాధికారం కోసం ఒకే పార్టీ – ఒకే జెండా ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తామని, త్వరలో భారీ బహిరంగ సభ జరిపి పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటిస్తామన్నారు. ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీలు వెనుకబడిన వర్గాలను ఓటు బ్యాంకుగా చూశాయి తప్ప అభివృద్ధి చేయలేదని విమర్శించారు.