లేడీ కమెడియన్ కోవై సరళ తరువాత బ్రహ్మానందం కాంబినేషన్లో క్లిక్ అయిన మరో నటి పాకీజా. అసెంబ్లీ రౌడీలో పాకీజా కామెడీకి మంచి పేరు వచ్చింది. ఇదే కాకుండా రౌడీ ఇన్స్పెక్టర్, పెదరాయుడు వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో దాదాపు 50 సినిమాల వరకు చేసిన పాకీజా ఇప్పుడు దీనస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎంతోమంది సీనియర్స్ కి ప్రస్తుతం సరైన పని దొరకటం లేదు. ఓటీటీ, డిజిటల్ ప్రపంచలోకి సినిమా ఇండస్ట్రీ అడుగు పెట్టినా కొందరు నటీనటుల కడుపులు మాత్రం కాలిగా ఉంటూ.. ఆకలితో అలమటిస్తూనే ఉన్నాయి. వారంతా ఎదో ఒక యూట్యూబ్ ఛానల్ కి వచ్చి తమ కష్టాలని చెప్పుకోవటం ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం.అయితే తాజాగా ఈ జాబితాలోకి నటి పాకీజా కూడా చేరటం దురదృష్టకరం.
ఒకప్పుడు చేతి నిండా తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉంటూ.. తమిళనాడులో ఏడీఎంకే పార్టీలో సభ్యురాలిగా జయలలిత బతికున్నంతవరకు మహారాణిలా బ్రతికిన పాకీజా ఇప్పుడు.. ఆమె మరణాంతరం కష్టాలు మిగిలాయంటూ.. ఒక యూట్యూబ్ ఛానల్ లో చెప్పుకొచ్చింది. ఓవరాల్గా తెలుగు, తమిళ్లో 150కి పైగా చిత్రాల్లో పనిచేసిన ఈ నటి.. అవకాశాలు లేకపోవడంతో చాలారోజులుగా మధురైకి సమీపంలోని కారెకూడిలో ఉంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సీరియళ్లలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ రూ. 500 అద్దె చెల్లిస్తూ హాస్టల్లో ఉంటున్నానని.. ఒక్కోసారి తినడానికి కూడా అవస్థలు పడాల్సి వస్తుందని చెప్పింది. తన కష్టాలు తమిళనాడులో అందరి హీరోలకి చెప్పినా తనకి ఎవరు సహాయం చేయలేదని.. త్వరలో ఏపీకి వచ్చి అక్కడ సీఎంకి తన కష్టాల గురించి చెప్తానని.. తెలుగులో సీరియల్ అవకాశాలు ఉంటే చూడాలంటూ వేడుకుంది నటి పాకీజా.