Former Bihar CM jitan ram manjhi criticizes Kashmir files movie
mictv telugu

‘కశ్మీర్ ఫైల్స్’ వల్లే హిందువుల హత్యలు.. మాజీ సీఎం

June 4, 2022

1990లలో జరిగిన హత్యాచారాలను తెరకెక్కించిన సినిమా కశ్మీర్ ఫైల్స్ సినిమాపై బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లో హిందువులపై ప్రస్తుతం జరుగుతున్న దాడులకు ఆ సినిమానే కారణమని ఆరోపించారు. సినిమా మేకర్స్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని తాను ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. ఆ సినిమా ద్వారా తిరిగి కశ్మీర్‌లో అడుగుపెట్టాలంటే హిందువులను భయపడే పరిస్థితి కల్పించారని మండిపడ్డారు. ఈ సినిమా మిలిటెంట్ కుట్రలో భాగంగా నిర్మించారని విశ్లేషించారు.

వెర్రిగా అందరు శాసనసభ్యులు థియేటర్‌కి వెళ్లి మరీ సినిమా చూశారని, బీహార్ ప్రభుత్వం గుడ్డిగా ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిందని విమర్శించారు. ఇటీవల కశ్మీర్ పండిట్లతో పాటు బిహారీలపై కూడా కాశ్మీర్‌లో దాడులు జరుగుతున్నాయని, లోయలో శాంతిభద్రతలు కాపాడాలంటే కశ్మీర్‌ను బిహారీలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కాగా, ఇటీవల కాలంలో కశ్మీర్‌లో మైనార్టీలైన హిందువులను ఉగ్రవాదులు వరుసపెట్టి చంపుతున్నారు. దీనిపై కేంద్ర హోం శాఖ అత్యున్నత సమావేశం కూడా నిర్వహించింది. ఇదిలా ఉండగా, కశ్మీర్ లోయలో పనిచేస్తున్న సుమారు 177 మంది ప్రభుత్వ ఉద్యోగులను వారి కోరికపై సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే లోయలో ఉగ్రవాదులు పెట్రేగిపోతుండడంతో కశ్మీరీ హిందువులకు భారత ప్రభుత్వం ఆయుధాలను ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది.