న్యూజిలాండ్ మాజీ స్టార్ క్రికెటర్ హీత్ డేవిస్ (50) సంచలన ప్రకటన చేశాడు. ఇన్నాళ్లు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి రహస్యంగా ఉంచిన ఓ విషయాన్ని రివీల్ చేశాడు. తాను స్వలింగ సంపర్కుడిని (గే) అని హీత్ డేవిస్ వెల్లడించాడు.ఈ విషయం తనతో ఉన్నవాళ్లందరికీ తెలుసని అతడు తెలిపాడు. దీని గురించి బయట ప్రపంచానికి చెప్పడానికి చాలా కాలం పాటు తనలో తానే కుమిలిపోయాయనని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇక దాచాల్సిన అవసరం లేదని.. అందుకే బహిరంగంగా చెప్తున్నట్లు పేర్కొన్నాడు. తాను స్వలింగ సంపర్కుడినని ఆక్లాండ్ దేశవాళీ క్రికెట్ జట్టులోని ప్రతి ఒక్కరికి తెలిసినా తన పట్ల ఎలాంటి వివక్ష ప్రదర్శించలేదని హీత్ డేవిస్ చెప్పుకొచ్చాడు.
కాగా న్యూజిలాండ్‌లో స్వలింగ సంపర్కం నేరం కాదన్న విషయం తెలిసిందే. అదే విధంగా స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్దత ఉంది. ఇదిలా ఉంటే.. కివీస్ తరఫున 1994, ఏప్రిల్‌లో శ్రీలంకతో వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో పేసర్ హీత్ అడుగుపెట్టాడు. గతంలో ఇంగ్లండ్ క్రికెటర్ స్టీవెన్ డేవిస్ మాత్రమే తాను ‘గే’ అని 2011లో బహిరంగంగా ప్రకటించాడు. అతడి తర్వాత ఇలాంటి సంచలన ప్రకటన చేసిన రెండో పురుష క్రికెటర్‌గా హీత్ డెవిస్ నిలిచాడు. న్యూజిలాండ్ అంతర్జాతీయ క్రికెటర్లలో తాను గే అని చెప్పుకున్న తొలి ఆటగాడు హీత్ డేవిస్ కావడం గమనార్హం.