వామ్మో.. బీసీసీఐలో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా? - MicTv.in - Telugu News
mictv telugu

వామ్మో.. బీసీసీఐలో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా?

April 18, 2022

cci

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐలో జరిగిన, జరుగుతున్న దారుణాల గురించి కాగ్ మాజీ చైర్మెన్ వినోద్ రాయ్ సంచలన విషయాలు వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం 2017 నుంచి 2019 వరకు బీసీసీఐ స్పెషల్ కమిటీ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశారు. అప్పుడు బీసీసీఐలోని పలు లోపాలను గుర్తించారు. వాటిని ఓ పుస్తకం ద్వారా వెలుగులోకి తెచ్చారు. ఈ సందర్భంగా ఓ అంతర్జాతీయ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను చెప్పుకొచ్చాడు. ఆయన మాటల్లోనే.. ‘బీసీసీఐ మహిళా క్రికెట్ విషయంలో అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. వారిపై వివక్ష 2006 వరకు దారుణంగా ఉండేది. పురుషులు వాడిన టీమిండియా జెర్సీలను వారికి ఇచ్చేవారు. శరద్ పవార్ అధ్యక్షుడయ్యాక పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. వారికి సెంట్రల్ కాంట్రాక్టు ఇవ్వడం వల్ల వివక్ష కొంత తగ్గింది. 2017లో నేనున్నప్పుడు మహిళల వన్డే వరల్డ్ కప్ జరిగింది. అందులో హర్మన్ ప్రీత్ కౌర్ చేసిన 171 పరుగులతో జట్టు ఫైనల్‌కు వెళ్లింది. కానీ, ఆ మ్యాచుకు ముందు వారికి సరైన తిండి కూడా పెట్టలేదు. ఉదయం పెట్టే బ్రేక్‌ఫాస్ట్‌ లేదని బదులుగా ఒక్కొక్కరికి ఒక్కో సమోసా మాత్రమే ఇచ్చారు. మ్యాచ్ తర్వాత ఆమె నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్తూ ఏడ్చేసింది. సార్.. పరిగెత్తడానికి తగిన శక్తి లేక ఉన్న శక్తిని ఉపయోగించి కేవలం సిక్సులు మాత్రమే కొడుతూ పరుగులు చేశా. ఒక్క సమోసా తిని ఇన్ని పరుగులు చేశానంటూ చెప్పుకొచ్చింది. దీన్ని బట్టి బీసీసీఐ వైఖరిని అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం అంత దారుణంగా లేదు. నేడు పురుషులతో సమానంగా మహిళలు క్రికెట్ ఆడుతున్నారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పించి మ్యాచ్ ఫీజులు సక్రమంగా చెల్లిస్తే మరింత ముందుకెళ్తారు. ఇలాంటి సమస్యలను బీసీసీఐ తొందరగా పరిష్కరించుకుంటే బాగుంటుంద’ని వెల్లడించారు.