Former Chairman of Tata Group.. Cyrus Mistry is no more
mictv telugu

టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌..సైరస్‌ మిస్త్రీ ఇకలేరు

September 4, 2022

టాటా గ్రూప్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆ సంస్థ గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అహ్మదాబాద్‌ నుంచి ముంబైకి వస్తుండగా, పల్ఘర్ చరోటి ప్రాంతంలో ఆయన కారు డివైడర్‌ ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు.

ఎస్పీ బాలాసాహెబ్‌ పాటిల్‌ తెలిపిన వివరాల ప్రకారం..”ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళ్లే మార్గంలో సూర్య నది వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన మెర్సిడెస్ కారు నంబర్ ఎంహెచ్‌ 47AB6705. వంతెనపై ఉన్న డివైడర్‌ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది” అని ఆయన అన్నారు.

అనంతరం ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని..చికిత్స నిమిత్తం గుజరాత్‌కు తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు..ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు ప్రారంభించారు.

సైరస్‌ మిస్త్రీ..1968 జులై 4వ తేదీన జన్మించారు. యూకెలోని ఇంపీరియల్ కాలేజ్‌లో సివిల్ ఇంజనీరింగ్, లండన్ బిజినెస్ స్కూల్‌లో మేనేజ్‌మెంట్‌లో ఎమ్ఎస్సిని చేశారు. 2006 నుంచి టాటా సన్సకు డైరెక్టర్‌గా పనిచేశారు. అనంతరం నవంబర్ 2011లో టాటా సన్సకు డిప్యూటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. టాటా ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా స్టీల్ లిమిటెడ్, టాటా పవర్ కంపెనీ లిమిటెడ్, టాటా టెలిసర్వీసెస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీలకు కూడా ఆయన డైరెక్టర్ గా వ్యవహరించారు.